Sunday, 30 March 2014

ఓరి నీ ఏషాలోయ్...!

బండోడా నీ గురించి రాయటం లేదని అమ్మ చాలా పోరు పెడుతోంది. కానీ రాయాల్సింది ఎంత పేరుకుపోయిందంటే, రాయటానికి చాలా పెద్ద సమయం కావాలి. అలాగని ఆ పెద్ద సమయం కోసం ఎదురు చూస్తుంటే, ఈలోగా రాయాల్సింది మరింత పేరుకుపోయి, అది రాయటానికి మరింత పెద్ద సమయం కావాల్సి వస్తోంది. అందుకనే, రాయాల్సిందంతా రాయకపోయినా, అందాకా చిన్నగా ఈ కాస్త రాద్దామని మొదలుపెట్టాను. తీరా చూస్తే మైండంతా ఆల్రెడీ బ్లాంక ఐపోయింది.

ఈ మధ్య నువ్వు నన్ను గుర్తుపడుతున్నావు. మంచం మీద పడుకున్న నీ కళ్లు మంచం చుట్టూ నేను నడిచి వెళ్తుంటే నన్ను అనుసరిస్తున్నాయి. అప్పుడప్పుడూ నవ్వుతున్నావు కూడా. ఎక్కువసార్లు అది నెర్వస్ నవ్వు. మా తంటాలు చూసి మమ్మల్ని ప్లీజ్ చేయటానికి నవ్వే నవ్వు. ఒక్కోసారి నవ్వుతావు, ఇంకా బహుశా రెండు బుగ్గల్నీ ఒకేసారి వాడటం రాలేదనుకుంటా, ఒక బుగ్గతోనే వంకర నవ్వు నవ్వుతావు. మెడ కూడా నిలబెడుతున్నావు. ఒక్కోసారి ఎటు చూడాలంటే అటు మెడ తిప్పుతావు, ఒక్కోసారి మెడ ఎటు వాలితే అటే చూస్తావు.

నిన్న నిన్ను మొదటి సారి ఇంటి ఓనర్ల దగ్గర వదిలి అమ్మ కోసం హాస్పిటల్‌కి వెళ్లాం. మేం వెళ్లగానే పడుకున్నావు. వచ్చేసరికి గానీ లేవలేదు. ఇంటి ఓనర్లు నువ్వు ఎంత బుద్ధిమంతుడువోననీ అస్సలు ఏడ్చి గోల చేయవనీ అనుకున్నారు. మేం ఇలా ఇంటికి తీసుకొచ్చామో లేదో మళ్లీ నీ పెంకి గోల మొదలుపెట్టేశావు. నిన్న రాత్రయితే ఎంత చక్కగా ఆడుకున్నావొ. రాత్రి రెండింటికి మొదలుపెట్టి తెల్లార ఐదూ ఐదున్నర దాకా ఎన్ని ఆటలు ఆడావో. అమ్మనీ ఆటలు చూస్తూ పడుకోలేక, నిద్ర ఆపుకోలేక చాలా అవస్థ పడింది. ఈ మధ్య నీ ఏడుపుల్లోంచి అప్పుడప్పుడూ పిలుపులు కూడా వస్తున్నాయి. అవి మెల్లగా వుండవు. అరుపుల్లా అరుస్తావు. ఎవరన్నా దృష్టి పథంలో లేకపోతే చాలు "ఉంగాయ్" అనో "అవ్వాయ్" అనో అరుస్తావు. ఒక్కోసారి బాగా హుషారుగా ఉన్నప్పుడు బహుశా మా సమక్షపు పట్టలేని ఆనందం వల్ల అనుకుంటా, చిత్రమైన హెపీ అరుపు అరుస్తావు. అది అరుపు కూడా కాదు, just a squeal లాగా. ఉదాహరణకి ఈ వీడియోలో 11 సెకన్ల దగ్గర:—




ఇంతకీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? నా వళ్లోనే ఉన్నావు. నేను కాలి మీద కాలేసి, అడ్డ కాలు మీద నిన్ను పడుకోబెట్టుకుని టైప్ చేస్తున్నాను. నువ్వు మొత్తం కలిపి నా మోకాలి నుంచి అరికాలు దాకా పొడవున్నావు. ఈ మధ్య కాస్త బరువు మాత్రం పెరిగావులే. ఇలా ఒక కాలి మీద మోయటం ఇదివరకంతటి సులభంగా లేదు.'

ఇవాళ జయగాడు వచ్చాడు. చాలాసేపు నీతో ఆడుకున్నాడు. రేపు వాడి పుట్టిన్రోజు.  ఉగాది కూడా. వాడు రెణ్ణెల్లు ముంబయి వెళ్తున్నాడు. నిన్ను చూడననిపించి చాలా సేపు ఆడుకున్నాడు. నిద్ర లేపి మరీ.

నానమ్మ ఎప్పుడు వచ్చి నిన్ను చూద్దామా అని తపించిపోతుంది. కానీ పాపం ఎలక్షన్లు, కసాయి ఎమ్మార్వో రాకుండా నిలేస్తున్నాయి. అందుకనే అందాకా నాన్నమ్మకోసం నీ ఆటల వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నా. "నానమ్మా, నా యీ చిందుబాగోతం తెల్లారగట్ల నాలుగూ ఐదింటికి" :—



Tuesday, 25 March 2014

పెద్దాణ్ణి అయిపోతున్నానోచ్

అవును నిజం నేను పెద్దోడిని అయిపోతున్నా తెలుసా? నాకు ఈ నెలలో తల నిలబెట్టడం వచ్చేసింది. ఇంకా ఆటలు ఆడటం వచ్చింది. నాన్నని తెగ కొడుతున్నాను. నాకు నాన్నకు మంచి దోస్తీ అయింది. నాన్న నాకు అమ్మకన్నా మంచి ఫ్రెండ్ తెలుసా. నాతో ఆడతాడు, నాకు ఎన్నో కబుర్లు చెపుతాడు. అసలు నేనే నాన్నకు ప్రపంచం.

 అమ్మ నేను వచ్చాకా నన్ను పట్టించుకోవడం లేదని అస్తమాను గొడవపడుతుంది. ఇక నాన్నమ్మ అయితే నాగురించి విని తెగ సంతోష పడిపోతుంది. నాకు ఈ మధ్య ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఉక్కగా ఉందని నాన్న చెప్పగానే నాకోసం కూలర్ కొంది. అది వచ్చాకా కాస్త పడుకుంటున్నాను.




                                నాన్నమ్మ కూలర్ కొన్నాకా ఇలా హాయిగా పడుకుంటున్నాను.

 

                            అమ్మ పుట్టినరోజున గుడి నుండి వచ్చాకా మాఇద్దరికీ నాన్నతీసిన ఫొటో

                         ఇది నేను అమ్మ చల్ చల్ గుర్రం ఆడుతున్నపుడు నాన్నతీసిన ఫొటో



ఈ రోజునే నేను పూర్తిగా తల నిలబెట్టింది.




మా ఇద్దరి ఫొటోలు బాగున్నాయి కదూ.



బై మరి మళ్ళీ కలుద్దాం.

Sunday, 2 March 2014

రూపాంతరం

                                       

చాలా రోజులయింది కదండీ మనం కలిసి , అవును మీ అందరితో మాట్లాడటానికి నేను కొంచెం బిజీగా ఉన్నానండి.

గత నెలరోజులుగా నా విషయంగా బ్లాగ్ లో రాయడానికి కూడా మా అమ్మ,నాన్నలకు ఖాళీ లేదండీ.

ఏంటంటారా పుట్టినప్పటి నాకూ , ఇప్పటి నాకూ చాలా తేడానే ఉందండి.(రూపురేఖల్లో) 

ఆ పని మీదనే అమ్మ, నాన్న కూడా బిజీ. 

అమ్మేమో నన్ను అందరికీ ఒళ్ళుతో చూపించాలని ప్రతిన బూనితే , మరి నాన్నేమో నాకోసం ఆఫీసు ఎగ్గొట్టి మరీ 

నన్ను బలవంతుడిగా తయారుచేయాలని తీర్మానించుకున్నారు.                 

ఇక నా విషయానికి వస్తే , నాకు బేసిగ్గా  ఏడవడానికి కూడా ఓపిక లేదు. అది మీకూ తెలుసు. మాట్లాడితే  

పులమారడం, కాస్త ఆడుకుంటే ఎక్కిళ్ళునూ.ఈ పరిస్దితుల్లో అమ్మ దగ్గర పాలు ఉన్నా తాగలేను.

అందుకే పాల డబ్బాకు అలవాటు పడ్డాను. ఆ పాలు నా మీద బాగానే పని చేసాయి. ఇక తాగడం మొదలేట్టాను. 

అంతే నాకు ఆకలి పెరిగింది. అమ్మకు బీపీ పెరిగింది(పాలుకలపలేక).

నాన్న మాత్రం డబుల్ డ్యూటీ హ్యపీ. (ఎందుకంటే పెరుగుతున్న నారూపాన్ని చూసుకుని మురిసిపోవడమే పనిగా 

పెట్టుకున్నాడు.  పైకి అందరికీ అమ్మ ఆరోగ్యం బాగాలేదని అందుకే ఇంట్లో ఉండి ఈ నెల వర్క్ చేసుకుంటున్నానని 

వంక పెట్టాడు.).

మొన్న మా చిన్నబాబాయి వచ్చాడు. నన్ను చూడగానే తిన్నాడు "కాజా "నా రూపాన్ని చూసి వాడు వీడేనా 

అంటూ వెళ్ళే వరకూ ఓ క్షణం వదిలితే ఒట్టు.

బలంతో పాటు నాకు ఆటలు, కాళ్ళు చేతులతో తన్నడం కూడా వచ్చింది. 

బాబాయే కాదు. మా మల్లీశ్వరి కూడా నన్ను చూసి మురిసిపోతుంది. కానీ అమ్మ నన్ను ఎవరికీ ఇవ్వదు.

ఇక నన్ను చూసి బక్కగా ఉన్నపుడే తెగ ముద్దులాడే మా నాయనమ్మ ఇప్పుడు చూస్తే ఏలా ఫీల్ అవుతుందో

చూడాలని ఉంది.

                                                  సరే ఇక నా రూపాంతరాన్ని చూడండి మరి.


                                               నాన్న ముద్దులు పెడుతున్నప్పుడు నా ఫోజు


                                                           

                                                         అమ్మ ఎత్తుకోగానే ఆవలిస్తూ నేను.


                                                                 వటపత్ర సాయిలా


                                
                                                  నాన్న నాతో ఫొటో తీయించుకుని తన ఫేస్ బుక్ లో పెట్టుకున్నాడు.    
                             

                                      కడుపు నిండా పాలు తాగితే నాకు వచ్చే మత్తుతో నా ముఖం ఇలానే ఉంటుంది.
         

                                                      ఈ అవతారం కూడా అదే నండి.

                           


                                                ఇది నేను ఎప్పుడూ పెట్టే నా ఇష్టమైన ఫోజు
     

                                      అమ్మ నాకు ఆయిల్ మసాజ్ చేస్తుండగా నాన్న తీసిన ఫొటో


                                           ఇది అమ్మకు నా అన్ని ఫొటోల్లోనూ బాగా నచ్చిన ఫొజు


                                         నాకు కోపం వస్తే అంతే అయిపోయారు అమ్మ, నాన్న


                                                     కాస్త నవ్వించింది అమ్మ అప్పుడు ఇలా
 

                                                    నా దిగంబర రూపాన్ని చూపించాలని ఇలా
                                                             ఆటలప్పుడు నా ఫొజులు


                                                                              ఇదీ అంతే


                                             ఆ ఇక ఉంటానండీ మళ్ళీ కాస్త లావయ్యి కనపడతాను. బై.

Wednesday, 22 January 2014

నాన్నాతో నా ఆటలు

జయ బాబాయ్ వచ్చాడు నన్ను చూడడానికి . రెండు రోజులు ఉన్నాడు. నా ఆటలు , నా కదలికలు, అన్నీ చూసి

మురిసి పోయాడు. నాతో ఆడుకున్నాడు. నన్ను ఎత్తుకుని ఆడించాలని చాలా ఆశ పడ్డాడు. కానీ నేను ఇంకా

ఎదగాలి కదా అందుకే కాస్త జంకాడు.

రవీ మామయ్య కూడా నా ఆటలు చూసి మురిసి పోయాడు. కాసేపు ఆడుకుని వెళ్ళాడు.

నాన్నకు నా ఆటలతోనే సరిపోతుంది. నాకు పాలు పట్టడం , ఆడించడం  నన్ను చూసి మురిసిపోవడం ఇవే

పనులు ,నాన్నకు నా మీద ఎంత ప్రేమో తెలుసా. నాతో ఆడే మంచి ఫెండ్ మా నాన్న.

నాన్నమ్మ నా ఆటలకు మురిసి పోతుంది. నాకు ఎక్కుళ్ళు వస్తే చాలు చాలా భయపడిపోతుంది తెలుసా.









Sunday, 19 January 2014

నాన్నమ్మ చెప్పింది:

8వ తారీఖు జనవరి 14. ఉదయం నుండి శ్రీశాంతి బాగానే ఉంది. శ్రీశాంతి ఎవరో కాదురా బుల్లోడా! మీ అమ్మ... మీ నాన్న ఆఫీసుకు బోయిండు. మీ అమ్మ నేను తీరి కూర్చుని కంప్యూటర్ల దొంగరాముడు సిన్మా చూడవట్టె. మస్తుగుంది సినిమా... దానికి తోడు మీ అమ్మ కామెంటరీ – క్రికెట్ కి కామెంటరీలా సినిమాకి మీ అమ్మ.

"జిక్కి పాటలు బాగున్నాయి" అంటనే సడెన్‌గా "అమ్మో అత్తయ్యా నాకు నొప్పులు... బాబో ఒళ్లంతా ఏదోలా వుంది" అంటా ఆగమాగం చేసె. వెంటనే మీ నాయ్నకి ఫోన్ కొట్టా. వెంటనే ఇంటికి పూడ్చు అని. ఈలోగా గబగబా గ్లూకోజ్ కలిపి మీ యమ్మకిచ్చా. రెండు గ్లాసులు తాగె. మీ నాయ్న తోలుకొచ్చేతలికి కొంచెం నిమ్మదించింది మీ యమ్మ.

"అమ్మా... మట్లపాలెం మాలక్ష్మి తల్లీ... తల్లీ బిడ్డా బాగోవలా అనుకొంటా నేను, అమ్మో అంటున్నా నవ్వుతోనే మీ యమ్మ ఆటో ఎక్కె. మీ నాయ్న స్కూటర్ పై వెంబడించె. సీదా రాగి హాస్పిటల్ డాక్టర్ సునీతమ్మ దగ్గరికి తోల్క పోయాం మీ యమ్మను.

ఆమె చూచీ చూడంగనే ఆపరేషన్ చెయ్యాల అనే. ఫిబ్రవరి 9 తేది పుట్టాల్సిన పిల్లగాడు... 8 - 1 - 2014 ఆపరేషన్. బ్లడ్ బాంక్ కి మీ నాయ్న పరుగులు. జనని బ్లడ్ బాంక్‌ల ఒక పాకెట్ దొరికె. ఈ లోగా మీ రవి మావ, రెడ్డి బాబాయ్ కూడా వచ్చి మీ నాయ్నకి తోడయ్యారు. జయబాబాయ్ కూడా నీవు పుట్టేసరికి వచ్చేశాడు. మీ అమ్మ మీ నాయ్నని పట్టుకొని ఏడ్చింది. నేను ధైర్యం చెప్పినా... ఊకో... నా ఆయుస్సు కూడా నీవే పోసుకో అని ధైర్యం చెప్పినా... డాక్టరమ్మ వచ్చి తొందర తొందరగా ఆపరేషన్ థియేటర్ కి మీ యమ్మను తీస్క బోయింది. ఏటయితాదో ఏమో భగమంతుడా నీవే రక్ష అనుకుంటా నేను, మీ నాయ్న, జయ బాబాయ్, రెడ్డి బాబాయ్, రవి మావయ్య అందరం వెయిటింగ్.

రెడ్డి బాబాయ్ కేక... అదిగో పిల్లాడు అంటూ... మూడు తలుపుల లోపల పుట్టిన నీ ఏడుపు. మా అందరకు వినిపించింది. నిన్ను స్ట్రెచర్ పై తోల్క వచ్చినారు నర్సమ్మలు. అందరం నీవు ఆడా, మగా అని కూడా చూస్కోలేదు. ముందుగాలే నేను, మీ అమ్మ, నాయ్న మువురం మగబిడ్డ లానే ఊలాడుకుంటుండె. అట్లనే నీవు బుల్లోడయినావు. నేను పుట్టాను అనే గొప్పబోయె బుల్లోడా నీ వెనకమాల యింత వెత జరిగె ఎరికెనా...

తెలంగాణ బుల్లోడికి ముద్దులతో...

నాయనమ్మ
(సశేషం)

అమ్మ చెప్పింది


నేను అమ్మా, నాన్నల ప్రేమకు రూపాన్ని. బిడ్డలు పుడితే అమ్మ ఆరోగ్యం చెడిపోతుందని , ప్రాణానికే ప్రమాదమని , ఎవరినైనా పెంచుకుందాం, వద్దన్నాడట నాన్న. కానీ అమ్మ పట్టుపట్టి మరీ నన్ను కనడానికి సిద్దమైంది.

నేను పుట్టడం విషయంలో చాలా గందరగోళమే ఉంది తెలుసా. 8వ తారీఖున అమ్మ మామూలుగానే నాయనమ్మతో కలిసి దొంగరాముడు సినిమా చూస్తూ ఉంది ఈలోపు నేను కాస్త హడావుడి చేసి నాయనమ్మను కంగారు పెట్టాను. నాన్నను త్వరగారమ్మని కబురు చేస్తే ఇంటికి వచ్చి కంప్వూటర్ ముందు కూర్చున్నాడట నాన్న.




అమ్మకే కంగారనిపించి హాస్పటల్ కి వెళదామని బయలుదేరారు. అక్కడకి వెళ్ళేసరికి అమ్మకు బీపీ పెరిగి ఒళ్ళు చల్లగా అయిపోయిందట,  ఆపరేషన్ మరునాడు ఉదయం చేస్తానన్న సునీతా డాక్టర్ లేదు ఉదయమయితే ప్రమాదం అవుతుంది. ఓ రెండు గంటల్లో చేసేద్దాం అనగానే నాన్న, నాయనమ్మల్లో ఒకటే కంగారు. వెంటనే రక్తం కోసం నాన్న పరుగులు, అమ్మ తనకివే ఆఖరు క్షణాలన్నట్టు నాన్నని అందరికీ అప్పగించడాలు, ఈలోపు రవీ మామయ్య, రెడ్డీ మామయ్య, జయరాం బాబాయి బయలుదేరి వచ్చారట. అమ్మని ఆపరేషన్ దియేటర్ కి తీసుకుపోతున్నారు. ఇంకా నాన్నరాలేదు, అమ్మలో ఒకటే కంగారు చివరగా నాన్నను చూడాలి, తనతో మాట్లాడాలని, కానీ రక్తం కోసం వెళ్ళి ఆలస్యంగా వచ్చాడు నాన్న. అయినా ఇద్దరూ ఓ క్షణం చూసుకున్నారు. అంతే అమ్మ దియేటర్ లోనికి వెళిపోయింది. మత్తు ఇచ్చినా అమ్మ నా రాక గురించే ఎదురుచూస్తూ ఉంది. నేను రావడమే పేద్దగా ఏడుస్తూ వచ్చానట బైటకు. ఏ బిడ్డని అడగడం కంటే ముందు ఆరోగ్యంగా ఉన్నాడా అందట అమ్మ. అంతే అమ్మ నా ఏడుపు ఒక్కటే వింది.నేను చాలా పీలగా ఊపిరి తిత్తులు సరిగా ఏర్పడకుండా పుట్టాను కదా.  వేరే హాస్పటల్ కి వెళ్ళి దాదాపు 9రోజులు ఉండిపోయాను. ఇక్కడ అమ్మ నాగురించి బెంగ పెట్టుకుంది. పడుకోదు. ఓ పిచ్చిదానిలా అయిపోయింది. ఈ సమయానికి నా బాబు పాలకోసం ఏడుస్తాడు కదా అంటూ. ఆఖరికి సైకియాట్రిస్ట్ కి కూడా చూపించారట . అమ్మకి కోపం వచ్చి నా బాబూకి ఓ వయసు వచ్చాకా మందులు వాడతా గానీ ఇప్పుడు కాదని చెప్పి పంపేసిందట. ఆ డాక్టర్ వెళుతూ వెళుతూ ఓ క్షణం కూడా ఒంటరిగా వదలద్దని  చెప్పి వెళిపోయిందట. అప్పటినుండి అంతా ఒకటే కంగారు పడిపోయారట. రవీ మామయ్య, జయరాం బాబాయి అమ్మకు చాలా ధైర్యం చెప్పారట ఆసమయంలో. అందరికీ పైకి చాలా ధైర్యంగా  కనిపించే నాన్న మాత్రం అమ్మ ఏమౌతుందో , ఏలా ఉంటుందో అనే బెంగ , భయంతో ఉన్నాడు. నా కోసం పెద్దగా ఆలోచించలేదు. అమ్మ తరువాతే నేను అన్నాడు. అమ్మ కళ్ళు తెరిచాకా అప్పుడు నేను తండ్రినయ్యాను అనుకున్నాడట. అమ్మ అంటే అంత పిచ్చి ప్రేమ నాన్నకి తెలుసా. బాబు ఎలా ఉంటాడని అమ్మ అడిగితే వాడునాకు గ్రహాతరవాసిలా కనిపించాడు అన్నాడట.

మొత్తానికి నేను ఇంటికి వచ్చాను. నేను క్షేమంగా ఉండాలని అందరి కంటే ఎక్కువగా తాపత్రయ పడింది రవీ మావయ్య. అమ్మకు తోడపుడ్డక పోయినా అంతకన్నా ఎక్కువ. ఇక నుండీ నాకు కూడా. నన్ను చూడాలని చాలా ఆశ పడిన జయరాం బాబాయి ఉద్యోగ ప్రయత్నం కోసం  ఊరు వెళ్ళాడు. నాకు ఎలా ఉందోనని కనుక్కునేవాడు.. నా ఆకారం నిజంగానే చిన్నగా తయారైయింది బాగా చిక్కిపోయాను. ఇప్పుడు నా ప్రతి కదలికా ,హావభావాలు, నా నవ్వులు, నా ఏడుపు అన్నీ విడ్డూరమే వీళ్ళకు. అంతా నన్ను తెగ ముద్దు చేస్తున్నారు. నాన్న ఇప్పుడు ఎక్కువ సమయం నాతోనే ఉంటున్నాడు. అన్నట్టు నాకు ఇంకో బాబాయి ఉన్నాడు. పాపం బాబాయి చాలా దూరంలో కదా ఉండేది అందుకే మా పిన్నికి వీసా దొరకలేదట అందుకే చైతన్య బాబాయి మాత్రం చాలా కష్టం మీద 17 తారీఖున రాగలిగాడు. నన్ను చూసి అచ్చం నాన్నలానే ఉన్నాను అన్నాడట.                 

Saturday, 18 January 2014

నేను పుట్టాను...


పుట్టినప్పుడు ఇలాగున్నాను నేను. 2014 విజయనామ సంవత్సరం జనవరి ఎనిమిదో తారీకు రాత్రి 10 గం.ల 37 ని.లకు మేషరాశి, అశ్వినీ నక్షత్రంలో  హైదరాబాద్ మదీనాగూడలోని రాగి హాస్పిటల్లో పుట్టాను. పుట్టినపుడు బాగా ఏడ్చాను. అప్పుడు నాన్నకి బయట నుండి వినపడిందట. కానీ పాపం అమ్మ మాత్రం నన్ను చూడలేదట. మళ్లీ ఐదు రోజులకి గానీ (13 సాయంత్రానికి గానీ) అమ్మ నన్ను చూడలేదు. ఎందుకంటే పుట్టగానే నన్ను వేరే చిన్నపిల్లల హాస్పిటల్ వాళ్లు అంబులెన్సులో తీసుకుపోయారు. మరి నేను నెల రోజుల ముందే పుట్టేశాగా. అప్పుడు బాబాయి (జయరాం) నానమ్మతో అన్నాడట: "వీణ్ణి తిట్టడానికి నాకో పేరు దొరికింది. ఇక వీణ్ణి నెల తక్కువ వెధవ అని తిట్టొచ్చూ" అని. 

నన్ను అంకురా చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్లు తీసుకుపోయి NICU లో పెట్టారు. అప్పుడు చాలా బాధపెట్టారు. ముక్కుకు వెంటిలేటర్లు అవీ పెడితే ముక్కు దగ్గర దెబ్బ కూడా తగిలింది. అలా నన్ను ఏకంగా ఎనిమిది రోజులు ఉంచుకున్నారు. అప్పుడప్పుడూ అమ్మనీ, నాన్ననీ మాత్రం రానిచ్చేవారు. నాన్న వచ్చే వాడు గానీ, నన్ను ముట్టుకునేవాడు కాదు. అలా చూసి వెళిపోయేవాడు.
ఒక రోజు మాత్రం అమ్మ చెప్పిందని గట్టిగా అరికాల్లో కొట్టాడు. అప్పుడు కొంచెం నెప్పి అనిపించి ఏడ్చాను. అక్కడ ఉన్నప్పుడే నాకు పచ్చ కామెర్లు వచ్చాయి. అందరికీ వస్తాయట. తర్వాత తగ్గాయి. తర్వాత నెమ్మదిగా వెంటిలేటరూ, సీపాపూ, ఆక్సిజనూ ఇవేమీ లేకుండా కూడా నేను ఊపిరి తీసుకోవటం మొదలుపెట్టాను. అమ్మ లోపలికి వచ్చి పాలిచ్చేది. కూడా. అప్పుడు అమ్మ నన్ను చాలా ఫొటోలూ తీసింది. ఒక రోజు అమ్మ రవి మావయ్య కెమెరాతో లోపలికి వచ్చింది. దాన్ని చూస్తే నర్సులు తీసేసుకుంటారని భయంతో దాన్ని దాచుకుని మరీ తెచ్చింది. దానితో చాలాసేపు నన్ను వీడియో తీసేస్తున్నాననుకుని ఫీలైపోయింది. కానీ ఆ కెమెరా బటన్ నొక్కడం మర్చిపోయింది. పిచ్చిది. అమ్మకి ఏవీ రావు. తర్వాత రోజు నేర్చుకుని వచ్చి మళ్లా తీసింది. అప్పుడు నేను అన్ని రకాల హావభావాలూ ఫోజు ఇచ్చాను. నవ్వాను కూడా. అందరూ ఆశ్చర్యపోయారు. 

పదహారో తారీకు సాయంత్రం నేను మొదటి సారి వెలుగులో బయటి ప్రపంచాన్ని చూశాను. నన్ను కారులో ఎక్కించుకుని, అమ్మా, నాన్న, నానమ్మ ఇంటికి తీసుకువచ్చారు. రవి మావయ్య ఏమో బైకు మీద వచ్చాడు. నానమ్మ నాకు దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్లింది. ఈ కొత్త ఇంట్లో ఇప్పుడు నెమ్మదిగా కుదురుకోవటానికి ట్రై చేస్తున్నాను. చూస్తాను ఎలా జరుగుతుందో. 

ఇంకా నాకు ఆరు రోజులు పొద్దున్నా సాయంత్రం ఇంజెక్షన్లు చేయాలి. దాని కోసం నానమ్మా, నాన్న నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నారు. ఇవాళే కొత్త హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.ఇప్పటికి ఇంతే సంగతులు. మళ్లీ కొత్త విషయాలతో కలుస్తాను. అప్పటిదాకా సెలవు. 

మెహెర్ శివ రాఘవ
(ఈ పేరు అమ్మ నాకు పెట్టింది. అమ్మకి శివుడు, రాముడు కలిసి ఉండే పేరు పెట్టాలని అనిపించిందట. నాన్న మెహెర్ అని పేరుతో రాస్తాడు కాబట్టి ఆ పేరు కూడా ముందు తగిలించాలని అంది. అలా తయారైంది ఈ కలగాపులగం పాతచింతకాయపచ్చడి పేరు.)

Phaneendra - the moviemaker & Sreemaan - the troublemaker/ Neanderthal.

Nowadays I am feeling like a big Pro in art. I am not lying- Out of 1-10 I am at level 6.  *** I have been playing this video game called Sp...