పుట్టినప్పుడు ఇలాగున్నాను నేను. 2014 విజయనామ సంవత్సరం జనవరి ఎనిమిదో తారీకు రాత్రి 10 గం.ల 37 ని.లకు మేషరాశి, అశ్వినీ నక్షత్రంలో హైదరాబాద్ మదీనాగూడలోని రాగి హాస్పిటల్లో పుట్టాను. పుట్టినపుడు బాగా ఏడ్చాను. అప్పుడు నాన్నకి బయట నుండి వినపడిందట. కానీ పాపం అమ్మ మాత్రం నన్ను చూడలేదట. మళ్లీ ఐదు రోజులకి గానీ (13 సాయంత్రానికి గానీ) అమ్మ నన్ను చూడలేదు. ఎందుకంటే పుట్టగానే నన్ను వేరే చిన్నపిల్లల హాస్పిటల్ వాళ్లు అంబులెన్సులో తీసుకుపోయారు. మరి నేను నెల రోజుల ముందే పుట్టేశాగా. అప్పుడు బాబాయి (జయరాం) నానమ్మతో అన్నాడట: "వీణ్ణి తిట్టడానికి నాకో పేరు దొరికింది. ఇక వీణ్ణి నెల తక్కువ వెధవ అని తిట్టొచ్చూ" అని.
నన్ను అంకురా చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్లు తీసుకుపోయి NICU లో పెట్టారు. అప్పుడు చాలా బాధపెట్టారు. ముక్కుకు వెంటిలేటర్లు అవీ పెడితే ముక్కు దగ్గర దెబ్బ కూడా తగిలింది. అలా నన్ను ఏకంగా ఎనిమిది రోజులు ఉంచుకున్నారు. అప్పుడప్పుడూ అమ్మనీ, నాన్ననీ మాత్రం రానిచ్చేవారు. నాన్న వచ్చే వాడు గానీ, నన్ను ముట్టుకునేవాడు కాదు. అలా చూసి వెళిపోయేవాడు.
ఒక రోజు మాత్రం అమ్మ చెప్పిందని గట్టిగా అరికాల్లో కొట్టాడు. అప్పుడు కొంచెం నెప్పి అనిపించి ఏడ్చాను. అక్కడ ఉన్నప్పుడే నాకు పచ్చ కామెర్లు వచ్చాయి. అందరికీ వస్తాయట. తర్వాత తగ్గాయి. తర్వాత నెమ్మదిగా వెంటిలేటరూ, సీపాపూ, ఆక్సిజనూ ఇవేమీ లేకుండా కూడా నేను ఊపిరి తీసుకోవటం మొదలుపెట్టాను. అమ్మ లోపలికి వచ్చి పాలిచ్చేది. కూడా. అప్పుడు అమ్మ నన్ను చాలా ఫొటోలూ తీసింది. ఒక రోజు అమ్మ రవి మావయ్య కెమెరాతో లోపలికి వచ్చింది. దాన్ని చూస్తే నర్సులు తీసేసుకుంటారని భయంతో దాన్ని దాచుకుని మరీ తెచ్చింది. దానితో చాలాసేపు నన్ను వీడియో తీసేస్తున్నాననుకుని ఫీలైపోయింది. కానీ ఆ కెమెరా బటన్ నొక్కడం మర్చిపోయింది. పిచ్చిది. అమ్మకి ఏవీ రావు. తర్వాత రోజు నేర్చుకుని వచ్చి మళ్లా తీసింది. అప్పుడు నేను అన్ని రకాల హావభావాలూ ఫోజు ఇచ్చాను. నవ్వాను కూడా. అందరూ ఆశ్చర్యపోయారు.
పదహారో తారీకు సాయంత్రం నేను మొదటి సారి వెలుగులో బయటి ప్రపంచాన్ని చూశాను. నన్ను కారులో ఎక్కించుకుని, అమ్మా, నాన్న, నానమ్మ ఇంటికి తీసుకువచ్చారు. రవి మావయ్య ఏమో బైకు మీద వచ్చాడు. నానమ్మ నాకు దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్లింది. ఈ కొత్త ఇంట్లో ఇప్పుడు నెమ్మదిగా కుదురుకోవటానికి ట్రై చేస్తున్నాను. చూస్తాను ఎలా జరుగుతుందో.
ఇంకా నాకు ఆరు రోజులు పొద్దున్నా సాయంత్రం ఇంజెక్షన్లు చేయాలి. దాని కోసం నానమ్మా, నాన్న నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నారు. ఇవాళే కొత్త హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.ఇప్పటికి ఇంతే సంగతులు. మళ్లీ కొత్త విషయాలతో కలుస్తాను. అప్పటిదాకా సెలవు.
మెహెర్ శివ రాఘవ
(ఈ పేరు అమ్మ నాకు పెట్టింది. అమ్మకి శివుడు, రాముడు కలిసి ఉండే పేరు పెట్టాలని అనిపించిందట. నాన్న మెహెర్ అని పేరుతో రాస్తాడు కాబట్టి ఆ పేరు కూడా ముందు తగిలించాలని అంది. అలా తయారైంది ఈ కలగాపులగం పాతచింతకాయపచ్చడి పేరు.)


No comments:
Post a Comment