Tuesday, 21 October 2014

నాకు జర్రమొచ్చిందో..........

రాత్రి 9గంటలకు నాన్నమ్మతో కెమెరాలో మాట్లాడానా అరటి పండు తిన్నానని నాకు వేడినీళ్ళతో స్నానం చెయించాడు నాన్న. నాన్నకు నా ముఖం తోమడం రాదు కాస్త నీళ్ళు ఎక్కువపోసాడేమో తాగేశాను. అంతే ఇక అక్కడినుండీ జలుబు మొదలైంది. దానిలోనే జ్వరం, ఆయాసం, వాంతులు ఒకదానితరువాత ఒకటి అయిపోయాయి. అమ్మ కంగారు పడిపోయింది. నాన్న పరవాలేదన్నా ఏదో భయంగానే ఉంది తనకు. ఇక రాత్రంతా నేను నిద్రపోలేదు, అమ్మనాన్నలను నిద్రపోనీయలేదు. తెల్లవారాక కూడా అదే పరిస్థితి మళ్ళీ వాంతులయ్యాయి. నాన్న ఆసుపత్రికి తీసుకుపోదామన్నాడు. అమ్మనేను నాన్న బయలుదేరాం. డాక్టర్ గారు నన్ను చూడగానే ఇవి నిమోనియా చాయలన్నాయి వెంటనే జాయిన్ చేసుకోవాలన్నారు. నన్ను డాక్టర్ గదిలో ఉంచుకుని నాన్నని, అమ్మని బైటికి వెళిపోమన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో బైట తెలియని నాన్న తెగ కంగారు పడిపోయాడు. నేను మాత్రం వాళ్ళు సెలైన్ పెట్టడానికి సూది గుచ్చినా ఏడవలేదు. అది చూసిఅందరూ తెెగ వింతగా చెప్పుకున్నారు.
నేను ఆసుపత్రిలో ఓరోజంతా ఉన్నాను.


ఈమధ్య అసలు బాగాలేదు నాకు ఒకటే జ్వరం తగ్గుతుంది వస్తుంది. అంతా కంగారు పడుతున్నారు. అమ్మకు నావల్ల పనిపెరిగింది. నాన్నకు బిల్లు పెరిగింది. నాకు నీరసం పెరిగింది. ఇదీ సంగతి. వేలతో నయం కాని నా జ్వరం నాన్నమ్మ హోమియో పతి మందుతో నయం అయిపోయిందని నాన్నఅమ్మ తెగ చెప్పుకుంటున్నారు.

ఇక నాయనమ్మ నాగురించి ఫోన్లో సమాచారం కనుక్కోవడంతో సరిపోతుంది. ఇప్పుడన్నీ తగ్గాయనుకుంటుంటే మళ్ళీ అమ్మవారు పూసింది ఇది ఎప్పుడు తగ్గుతుందో మరి. :(

Tuesday, 23 September 2014

చినతల్లికి, నాన్న



బండి మీద వెళ్ళేటప్పుడు ఇదివరకు కూడా కనపడేవి కొన్ని హోర్డింగులు. జాలికళ్ళతో ఒక పసిపిల్లో పిల్లోడో కెమెరా వైపు చూస్తుంటారు, పక్కన కేప్షన్ ఉంటుంది, బండిజోరు తగ్గించమని సూచిస్తూ “మీ కోసం మీ కుటుంబం ఎదురుచూస్తోంది” అనో ఇంకోటో. అలాంటి ప్రకటనలు చూసినపుడు నేను వాటిల్లో క్రియేటివిటీ గురించి ఆలోచించేవాణ్ణి. “వీళ్లు భలేగా ఎమోషనల్ స్పాటు చూసి కొడుతున్నార”ని అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వొకడివి వచ్చి నన్ను నాన్నని చేసి నిలబెట్టాకా, అలాంటివి తిన్నగా నన్ను అడ్రెస్ చేస్తున్నాయి. బండి నడిపేటపుడు ఇదివరకట్లా ఎదర వున్న దాన్నల్లా దాటేసిపోవాలనే తొందర ఉంటం లేదు. ఇలా చిన్నచిన్న విషయాలు మొదలుకొని నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నావు నువ్వు. చాపకిందనీరు లాంటిది నీ మోహరింపు.

నువ్వు రాకముందు తండ్రిహోదా పట్ల నాకు కేవలం ఎవల్యూషనరీ ఇంట్రెస్టు మాత్రమే వుండేది. తండ్రి కావటం అంటే ఒక మనిషి జీవపరిణామ దశలన్నింటినీ అతిదగ్గరగా పరికించే అవకాశమని మాత్రమే తోచేది. అప్పుడు కూడా ఆ మనిషి ఒక స్త్రీయే కావాలనుకునేవాణ్ణి. నా బిడ్డలకోసమని నేను ఏరివుంచుకున్న పేర్లన్నీ అమ్మాయిలవే (అందుకే నీ పేరు పెట్టే అవకాశాన్ని పూర్తిగా అమ్మకే వదిలేశాను). అక్కలూ చెల్లెళ్ళూ మరదళ్ళూ మేనకోడళ్ళూ ఎవరూ లేకపోవటం వల్ల నాకు ఆడాళ్ళు ఎందుకు అలా ఉంటారు అనేది ఎప్పుడూ గోడ ఆవలి రహస్యమే. వారి స్నిగ్ధమైన ప్రపంచాలకి (జడరిబ్బన్ల, పూలదండల, డాన్స్‌క్లాసుల, సాయిబాబాగుడుల, హాండ్‌బాగుల, స్కూటీల ప్రపంచానికి) మొట్టమొదటి ఆంతరంగికుడిగా ఉండగలగటం నా దృష్టిలో అద్వితీయమైన పదవి. ఆ లోటు అలాగే ఉంది. కానీ అది అదే, నువ్వు నువ్వే.

ఆ ఎవల్యూషనరీ ఇంట్రెస్టు కూడా ఇప్పుడేం లేదు. సరే నువ్వంటూ ఉన్నావు గనుక, నీ ఎదుగుదల అంటూ నా కళ్ళ ముందు జరుగుతోంది గనుక, ఆ ముచ్చటా తీరుతున్నా, నన్ను నీ వైపు పట్టిలాగే కారణాల్లో అది వెయ్యోవంతు కూడా కాదు. మరి ఏమిటీ అంటే, అవేంటో తెలిస్తే ఇదంతా రాసే సందర్భమే కలిగేది కాదేమో. లేదూ, నిజానికి ఇదంతా బడాయేనేమో, మనిషిని కాబట్టి బుద్ధి కలిగించే అహంభావం వల్ల దీన్నంతట్నీ కేవలం ఒక జంతుసహజాతంగా చూడలేకపోతున్నానేమో. For all i know, ఇప్పటికైతే నీ మీద ఇష్టం నువ్వు ఒక కీ ఇవ్వకుండా ఆడే బొమ్మవి కావటం వల్లనే మాత్రమేనేమో.

నీ మీద నా ఇష్టం పూర్తిగా మానసికమైనదే కాదు; నాకు నువ్వో స్నిగ్ధమైన చర్మంతో కప్పివున్న చిన్ని అవయవాల చలిమిడిముద్దగా కూడా నచ్చుతావు. నీ చర్మం క్వాలిటీని స్నిగ్ధమని సరిపెట్టేయలేము. కాలపు కరుకురాపిడికి అది మున్ముందు నాకు నిగూఢమూ, నానుంచి భిన్నమూ, మరో అన్‌టచబుల్ సమక్షమూ అవుతుందని తెలుసు. ప్రస్తుతానికైతే నిన్నెత్తుకున్నప్పుడు నన్ను నేనే మోస్తున్నట్టు ఉంటుంది. ఎంత పీల్చినా సారం ముక్కుతో పాటూ తీసుకెళ్దామంటే పట్టుబడని నీ వాసన బాగుంటుంది. ఎత్తుకున్నప్పుడు నీ మెడలో ముక్కుదూర్చి పీలుస్తూంటాను. కానీ నువ్వు నా గడ్డం పెట్టే చక్కిలిగిలికి నవ్విస్తున్నాననుకుని నవ్వేస్తూ ఉంటావు. ఈమధ్య నీకు కింద వో రెండు పళ్ళు మొలిచాయి. దాంతో ఇప్పటికే నా పేలవమైన పెన్నుకి వర్ణనాతీతమైన నీ నవ్వు ఇప్పుడింకా అందని దూరమైపోయింది.

ప్రస్తుతానికి నువ్వో pure animal వి. ఇది రాస్తున్నప్పుడు కూడా, నాకు దూరంగా నేల మీద దొర్లాడుతున్న నువ్వు నా వైపు పాక్కొచ్చి ఈ కాగితం చింపటానికి ట్రై చేస్తున్నావు. అది కుదరనివ్వకపోవటంతో, నా జుట్టుని పట్టుకుని కిందకు గుంజే ప్రయత్నంలో పడ్డావు, అదైన తర్వాత ఇప్పుడు నా పక్కకు వచ్చి నిన్నూ నీ మొహాన్ని నా భుజంకేసి రాసుకుంటున్నావు. ఊరికే చెంగనాలు కడుతూ మధ్యమధ్యలో తల్లిని ఒకసారి ఒరుసుకుని మళ్లీ వెళ్ళిపోయే దూడకన్నా ఏమంత భిన్నం కాదు నువ్విప్పుడు. (ఆ తల్లికన్నా నేనూ ఏమంత భిన్నం కాదు. సుమతీసూక్తికి భిన్నంగా నాకు పుత్రోత్సాహం కలిగించటానికి నీ కేవలమైన ఉనికే సరిపోతుంది; చివరకు ఫేస్బుక్లో పెట్టిన నీ ఫొటోకి వచ్చిన లైకులు కూడా సరిపోతున్నాయి.)

అయినా నీ వైనాల్లో ఒక వ్యక్తిత్వాన్ని చదవటానికి విపరీతంగా ప్రయత్నిస్తుంటాం మేం. నాకన్నా ముఖ్యంగా అమ్మ. నీ అన్ని చర్యలూ తనకి ఉద్దేశపూర్వకమైనవిగా కనపడతాయి. ఆ ఉద్దేశాల్ని గెస్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నట్టు, విశదంగా తెలిసిపోతున్న విషయాల్లా మీ అమ్మ చదివి చెప్పేస్తూంటుంది. నేను మాత్రం ఇంకా నీ చర్యలకి బయటి ఉద్దీపనల్నే తప్ప, నీ లోపలి ఉద్దేశాల్ని కారణంగా చూడలేకపోతున్నాను. నువ్వు నాలిక బయటపెట్టి ఆడిస్తున్నప్పుడు తనని వెక్కిరిస్తున్నావంటుంది మీ అమ్మ. కొత్తగా వచ్చిన నీ పళ్ళ పదును మీద సరదాగా నాలిక ఆడిస్తున్నావంటాను నేను. ఇలాంటి నీ వేషాల్లో ఏమాత్రం తేడాగా అనిపించినా అది సహజమేనని ఇంటర్నెట్లో వెతికి ఖాయం చేసుకునేదాకా ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు.

కానీ నా మనసంతా ఇలా రంగురంగుల బెలూన్లమయం మాత్రమే కాదు. వాటిని గుచ్చి పేల్చే శంకలూ ఉన్నాయి. అప్పుడప్పుడూ ఏమనిపిస్తుందంటే, ఇన్ని కోట్లమంది లోకజ్ఞులూ సజ్జనులూ ఋజువర్తనులూ ఐన మగవాళ్ళున్న లోకంలో, నువ్వు ఇలాంటి ఒక మగవాడి హయాంలోకే వాడినే తండ్రిగా చేస్తూ ఎందుకు ఊడిపడ్డావా అని. అప్పుడు నీ మీద ఒక తటస్థమైన జాలి కలుగుతుంది. ఎందుకంటే, అలా ఎలా కుదిరిందో చెప్పలేనుగానీ, నేను ఒక సామాజిక మానవునిగా ఎదగలేదు. కనీసం పైపై అప్పియరెన్సెస్ వరకూ పద్ధతైన సంసారి వేషాన్ని ఎలాగో నెట్టుకొస్తున్నాను గానీ, నా మనసు ఏ విలువనూ అబ్సొల్యూట్‌ అని నమ్మదు, ప్రతి అవధికీ కన్నాలు తవ్వి అవతలికి దూరుదామని చూస్తుంది. ఇలాగుండటంపై నాకు ఏ ఫిర్యాదులూ లేవు సరికదా గొప్పగా కూడా ఫీలవుతుంటాను. కానీ ఈ స్థితికి వచ్చే క్రమంలో మనసు చేసిన ప్రయాణం సురక్షితమైంది కాదు. అది ఆవలించే లోయల పైన బార్బ్‌డ్‌వైరు మీదుగా దొమ్మరి నడక. ఇప్పటికీ చాలా డెలికేట్ బాలెన్సే. అలాంటి ప్రయాణం నువ్వు చేయటం నాకు ఇష్టం లేదు. ఈ స్థితికి నువ్వు చేరటం ఇష్టం లేదు. అదికూడా కేవలం ఇలాంటి ఒక నేను నీ తండ్రినవ్వటం అన్న కారణంగా జరగటం అస్సలు ఇష్టం లేదు. లోకపు లౌక్యపుటిరుసుకి ఏ రాపిడీ లేకుండా కందెన సులువుతో ఒదిగి సాగిపోవాలి నీ జీవితం. (ఒక్కోసారి నువ్వు పుడుతూనే నాలో ఎక్కడో స్టాప్‌వాచీని క్లిక్ చేశావనిపిస్తుంది. నాకు ఎంతో టైం లేదు. మరీ నిన్ను అయోమయపరిచేంత బొహేమియన్ వాతావరణం ఏం లేకపోయినా, ఉన్న కాస్త అస్తవ్యస్తాన్నీ చక్కదిద్దుకుని నిన్ను లోకరీతికి అనుగుణంగా పెంచగలిగే నాన్నలాగా మారిపోవాలి. క్లాక్ ఈజ్ టికింగ్!)

అలాగని మళ్ళీ నువ్వు అందరుపిల్లల్లాగా పెరగటం కూడా ఊహించుకోలేను. ఆ పసుపురంగు స్కూలు బస్సుల కిటికీల్లోంచి కనిపించే అనేక యూనిఫారాల్లో ఒక యూనిఫాంగా నువ్వు మారటం నాకిష్టం లేదు. నాన్ననో ధృవనక్షత్రంగా చూసే అమ్మ మరీ నాన్న లోకంలోకి ఇమ్మెర్స్ అయిపోయి అవును వీణ్ణి బడికిపంపవద్దంటూ వంతపాడటం మొదలుపెట్టింది గానీ, నాన్నకైనా బుద్ధుండాలిగా. స్కూలుకి పంపక ఏం చేయను. నగరంలో బతక్క ఏం చేయను. ఈమధ్య నిన్ను ఎత్తుకుని బయటకు తీసుకెళ్ళినపుడు మరీ అనిపిస్తుంది. నువ్వు నా భుజం మీద చుబుకం ఆన్చి వచ్చే పోయే కార్లనో, బైకుల్నో చూస్తూంటావు. గట్టిగా హార్న్ వినపడినప్పుడల్లా ఉలికిపడతావు, అహ, పడేవాడివి, ఇప్పుడు అలవాటుపడిపోయి అటు మామూలుగా చూస్తావు. నిన్ను అలా తీసుకెళ్ళి నా బాల్యాన్ని ఆవరించిన దృశ్యాల్లాంటివి చూపించాలని ఉంటుంది. బాటంతా గొద్దెలమయం చేసే మేకలమందల్నో, అష్టాచెమ్మా ముగ్గులు గీసున్న రామాలయం గచ్చునో, మాగన్ను మధ్యాహ్నాలు చల్లగా గలగలల సందడి చేసే రావిచెట్టునో, నత్తలు రథం ముగ్గులేస్తున్న ఆఖరి కోనేటిమెట్టునో, కోసిన పొలంలో గడ్డిమేటు వెనుక కుంగే మెత్తటిబింబాన్నో చూపించాలని ఉంటుంది. నా బాల్యానికి అవన్నీ ఉన్నాయి. నిన్ను మాత్రం ఒక కరుకైన లోకంలోకి తీసుకొచ్చి పడేశాను. ఇది ట్రాఫిక్‌ వల్లనూ, కాంక్రీటు వల్లనూ మాత్రమే కరుకైన లోకం కాదు. శివార్లలో గొంతులుకోసే ముఠాలు తిరిగే లోకం, తల నుంచి గోనెసంచులు వేలాడే పిల్లలు చెత్తకుప్పల్లో ఇనుపచువ్వలు పుచ్చుకుని పాలిథీన్ కాగితాలు ఏరుకునే లోకం, లిప్తమాత్ర యథాలాపపు డ్రైవింగ్ వల్లనే పుచ్చెలు పగిలి చచ్చే అవకాశాలతో కిక్కిరిసిన లోకం, భుక్తిరీత్యా నిత్యం కదుల్తూనే తప్ప నిలకడగా నిలబడిన మనుషులు అరుదుగా కనిపించే ప్రాగ్మాటిక్ లోకం.

మరి ఇలాంటి చోట్ల పిల్లలు పుట్టటం లేదా ఆరోగ్యవంతంగా పెరగడం లేదా అనొచ్చు. ఆమధ్య కొన్నాళ్లపాటు చిత్రమైన రీతుల్లో సమాధానపడేవాణ్ణి. సృష్టిలో ప్రతీదీ ఆ నూటపద్దెనిమిది రసాయనికమూలకాలతో నిర్మితమైనదే కదా. మరి, అవే మూలకాల్లో కొన్నింటితో తయారైన చెట్టుని అందమనీ, ఇంకొన్నింటితో తయారైన కాంక్రీటు భవనాన్ని వికారమనీ ఎందుకు అనుకోవాలీ అనీ ఇలా. కానీ అందమూ వికారమూ కాదు అసలు డిస్టింక్షను. సహజమూ అసహజమూ, ఇంకోలా చెప్తే ప్రకృతిసహజమూ మానవనిర్మితమూను. ప్రకృతి పరివృతమై పెరిగిన బాల్యం ఆలోచనకి కలిగించే విశాలత్వం వేరు. ఎదిగాకా అది చుట్టూ లేకపోయినా, మెదడులో ఒక పచ్చటి విశాలమైన అర అలా ఉండిపోతుంది. అది ఎంత రద్దీలోనైనా నిమ్మళాన్ని ఇస్తుంది. ఎంత ఇరుకులోనైనా వెసులుబాటు ఇస్తుంది. నీకు అది లేదు. నువ్వు కంప్లయిన్ కూడా చేయలేవు. ఎందుకంటే నీకు ఇది తప్ప ఇంకోటేదీ తెలియదు. ఎంపికకి అవకాశం లేదు. అదింకా విషాదం. నిజంగా నువ్వే నా మొట్టమొదటి ప్రయారిటీవైతే వెంటనే ఊరెళిపోయి ఏ కిరాణాషాపో పెట్టుకోవాలి. కానీ ఇందాక చెప్పినట్టు ఎదిగే క్రమంలో ఎక్కడో నేనిలా నగరాటవిలో మాత్రమే శరణులభించే మృగంగా మారిపోయాను.

ఇవి చాలవన్నట్టు ఇంకో పెద్ద గుంజాటన ఉంది. బహుశా వీటన్నింటికీ అదే మూలమై నన్నిలా రాయిస్తుందేమో. నాకు నాన్న అనే శాల్తీ లేకపోవటం వల్ల నిన్ను పెంచటానికి నాకు ఒక మోడల్ లేకుండా పోయింది. అది మంచో చెడో నికరంగా చెప్పలేను గానీ, అది అలా ఉంది. ఒక చెడు ఎగ్జాంపుల్ ఉండుంటే మంచి వైపు వెళ్ళటం సులువయ్యేది, ఒక మంచి ఎగ్జాంపుల్ ఉండుంటే అనుసరించేవాణ్ణి. ఇప్పుడు నా రోడ్డు నేనే వేసుకోవాలి. నువ్వింకా పాకగలిగే చిన్నిప్రపంచంలో మాత్రమే ఉన్నావు కాబట్టి అదింకా పెద్ద కన్సెర్న్ కాదు. కానీ కొన్ని భయాలు. I fucked up so many relationships. I want us to be a success.


Friday, 19 September 2014

మానాన్నా నేను.........

మీనాన్న నువ్వు ఆడుకుంటుంటే భలే బాగుంటుందిరా చూడడానికి రెండుకళ్ళూ చాలవన్నట్టు ఉంటుంది. నీ చిట్టి చేతులతో నాన్న ముఖం తడుముతుంటే ఎంత ఆనందపడిపోతాడో నాన్న. నిన్ను చూసుకుని మురిసిపోతాడు. అలా చూస్తుండిపోతాను మిమ్మల్ని. నువ్వు తన గుండెల మీద జుట్టు ఎంత బలంగా లాగేసినా, రక్కేసినా అస్సలు నొప్పి అనేదాన్ని తన ముఖం మీద కనపడనీయడు. చూస్తూనేను మాత్రం నిన్ను తిడతాగానీ మీ నాన్న తెగ ఆనందపడిపోతుంటాడు. ఇద్దరివీ ఎన్ని ఫొటో ఫోజులున్నాయో.......













నాతో అమ్మానాన్న.......

ఎప్పుడూ నాకేనా ఫొటోలు మీరు కూడా తీయించుకుంటేనే నేను తీయించుకుంటాను ఫొటో అని ఈమధ్యన మారం చేస్తున్నాను. అందుకే కాబోలు మొన్న అమ్మ కాలేజీ పనిమీద వెళ్ళినపుడు అందరికీ కలిపి తీయించింది.ఎప్పుడూ తన చక్రాల్లాంటి కళ్ళను మూసేసే అమ్మకూడా ఈసారి మంచిఫోజులిచ్చింది. ఏకళ్ళనున్నాడోగానీ పూర్తిగా షేవ్ చేసుకొచ్చాడు నాన్నా, నేను ఇలా అన్నానని నన్ను కొట్టడానికి వస్తే మీరు ఆపండే నాన్నను నన్ను కొట్టనీయకండి.....








ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ ఇంతకముందు చూడలేదుకదా మేము ఏలా ఉన్నామో.... ......



చూడండి ఏలా ఉన్నాం. అమ్మకి నాకు వచ్చినట్టుకూడా రాదు ఫొటోకి ఫోజీయడం ఇక నాన్నయితే.....అబ్బో.....





ఈ రోజు చిన్న తాత వచ్చారోచ్.........

అవును నన్ను చూడడానికి చిన్నతాత చాలా దూరం నుండీ వచ్చారు తెలుసా..... నాతో చాలా ఆటలాడారు. ఎత్తుకున్నారు, బొజ్జో పెట్టారు. అసలు నన్ను వదలనేలేదు. సాయంకాలం వరకు నాతోనే ఉన్నారు తాత.....నాకు పాలకోవా తినిపించారు భలే ఆడుకున్నాం ఇద్దరం.ఈసారి వచ్చేటప్పుడు చిన్న నాన్నమ్మని కూడా తీసుకువస్తానన్నారు.





నేను పెద్దబాబాయిని చూసానోచ్.........


నాకోసం పెద్ద బాబాయి వచ్చినట్టు గుర్తులేదు.అప్పుడు నేను చాలా చిన్నకదా..... నా ఫొటోలు మాత్రం చూసాడని తెలుసు. అవునురా నీకు గురుతుందా మొన్న మనం మీ పెద్దబాబాయిని చూడడానికి వెళ్ళాము. అక్కడికే మీ పిన్నికూడా వచ్చింది. నీకు బొమ్మలు కూడా తెచ్చింది. పెద్ద బాబాయితో , నాయనమ్మతో ఎన్ని  ఫొటోలు దిగాం . అప్పటికి పిన్ని వెళిపోయింది. సరే అవి ఎంతబాగా వచ్చాయో చూడు........













చిట్టల్లరి.....

 ఆ చూపు చూడండమ్మా అసలు ఎక్కడన్నా చిన్నపిల్లాడిలా ఉన్నాయా ఆచూపులు ఏదో కొరుక్కు తినేస్తానన్నట్టు లేదా తంతానన్నట్టు లేవు.అప్పుడే పెద్దాడిని అయిపోయాను అనుకుంటున్నావుకాబోలు వేసిన డైపరు విప్పేసుకోడాలు, స్నానానికి టబ్బులో వేస్తే బైటికి రావడానికి జంపింగులూనూ, నీ అల్లరితో కాస్త విసుగువచ్చినా, నీ నవ్వుతో పోగొట్టేస్తావురా...... ఈమధ్య నీకు పళ్ళొస్తున్నాయిరా... అప్పుడే మూడు పళ్ళు వచ్చాయి నీకు. నన్ను కొరకడం కూడా మొదలు పెట్టావు.











పడక సీను

అయ్యగారు ఈమధ్య మారాం చేయడం మేం పట్టించుకోకపోతే ఉయ్యాలలోంచి దూకేయడం. ఏలా పడతాయో తెలుసా చాలా నెమ్మదిగా దిగుతావు చాలాసార్లు, లేదా ఆదమరుపుగా ఉన్నపుడు గోడమీద బల్లి పడుతుందే అలా ఓక్కసారి దూకేస్తావు నేల మీదకు. ఇదో ఆటనీకు. ఆటంటే గుర్తొచ్చింది. నీకు ఓ బొమ్మలపెట్టి ఉందిరా దానిలో చిన్నచిన్న మూతలు, బంతులు వేసి పెడుతుంటే దానిదగ్గరకు పాక్కుంటూ పోయి దాన్ని లాగేసి మరీ ఆడుకుంటు్న్నావురా బంగారు కొండలాగా......

పడుకున్నప్పుడు పిచ్చి ఫోజులన్నీ పెడతావు నిన్ను మీనాన్న ఫొటోలు తీసి ఆనందపడిపోతాడు కావాలంటే చూడు.















Phaneendra - the moviemaker & Sreemaan - the troublemaker/ Neanderthal.

Nowadays I am feeling like a big Pro in art. I am not lying- Out of 1-10 I am at level 6.  *** I have been playing this video game called Sp...