Saturday, 23 June 2018

బుడ్డోడు స్కూలు కష్టాలు మొదలు...

మధ్యాహ్నం పదకొండు అయితేగానీ నిద్రలేవని చిన్నోడు ఇప్పుడు ఉదయం ఏడు గంటలకే నిద్ర లేవాల్సి వస్తుంది. నిద్ర ముఖంతోనే పాలు, టిఫిన్ కానిచ్చి ఏడుస్తూ స్నానానికి వెళుతున్నాడు. కానీ ఇక్కడ వాడు ఆనందించేది ఏదైనా ఉందంటే అది యూనీఫారం, బూట్లూ వేసుకోవడమే. తననో పోలీస్ అనుకుంటాడు పిచ్చివెధవ. ఇక అప్పటినుండీ మొదలు నేను కూలెల్లను....నేను కూలెల్లాలా... ఇలా అడిగిందే అడిగి చంపుకుతింటాడు.

తీరా స్కూలుకు తీసుకుపోయాకా ముఖం ఎంత దీనంగా పెడతాడంటే దింపడానికి వెళ్ళిన వాళ్ళకి మనసు నీరైపోయి చేతులారా పిల్లాడిని స్కూలుకు అప్పగించానే అనే పశ్చాతాప పడిపోయి బరువైన హృదయంతో తిరిగి వచ్చేలా చేస్తుంది.

ఇక వాడు స్కూలుకు వెళ్ళిన కాసేపటికే అమ్మగా నేను, నాన్నగా మాఫణీ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఏదో యుద్ధంలో గెలిచిన వీరుడిని చూస్తున్న ఫీలింగ్ ముఖంలో...

రెండు గంటలకు అయ్యగారు ఇలా మొదలు పెడతాడు. నాన్నా ట్యూషన్ ఎల్లాలా... అంటూ.. అవునురా వెళ్ళాలి అంటే అబ్బాయిగారికి అదో బెంగ... ముఖం వాడిపోయి, డల్ గా తయారవుతుంది. ఏదో నచ్చజెప్పి పంపితే తిరిగి తెచ్చేప్పుడు లంచంగా ఐస్ క్రీమో, లేదా కూల్ డ్రింకో ఉండాల్సిందే.... బలవంతంగా పంపినందుకు వాడు మాకు విధించే జరిమానా అది..
ఇక రొప్పుకుంటూ మెట్లెక్కి ఇంట్లోకి రాగానే ఎ బి అంటూ సిస్టం ముందు కూచున్నవాడు ఎంతకీ లేవడు. ఇంత తిని పడుకుంటాడంటే మళ్ళా అమ్మ రేపు కూలెల్లాలా... అంటూ చాలా బెంగ పడిపోతూ పడుకుంటాడు వెధవ. పాపం కదా...

Thursday, 7 December 2017

స్కూలెల్లను!

లైన్లో పిల్లలందరి తోపాటు శివగాడు చిన్న చిన్న అడుగులు వేస్తూ గేటు వైపు నడుస్తున్నాడు. వెనకాలున్న పిల్లాడు షూ తొక్కితే పడబోయాడు. లైన్ ఆగిపోయి పిల్లలు ఒకర్నొకరు గుద్దుకున్నారు. కలదొక్కుకుంటూ ఊరికే నవ్వుతున్నారు. ఆయా అరుస్తూ ముందుకొచ్చింది. శివగాడు కోపంగా ముఖంపెట్టి ఫిర్యాదు చెప్పాడు. లైన్లో వాడి ముందున్న పిల్ల చేయిపట్టుకు లాగింది నడవమని.

శివవాళ్ళ నాన్నకి తను లేనప్పుడు శివగాడు బయట ఎలా ఉంటాడో చూడటం ఇష్టం. అందుకని రోడ్డుకి ఇవతలే నిలబడి గేటు కమ్మీల్లోంచి చూస్తున్నాడు. పిల్లల లైను మెట్ల దాగా వచ్చి విడిపోయింది. శివగాడు పైమెట్టు మీద ఆగి పిల్లల భుజాలు తగుల్తుంటే నిలదొక్కుకుంటున్నాడు. బ్యాగ్ స్ట్రాప్స్ లోకి వేళ్లు దూర్చి, ముందుకి వంగి అటూ ఇటూ వెతుకుతున్నాడు. నాన్న కనిపిస్తే ముఖమంతా నవ్వు. మెట్ల మీంచి గెంతి వీధి దాటబోతోంటే నాన్న ‘‘జార్తరా!’’ అని ముందుకొచ్చి ఎత్తుకొన్నాడు.

అక్కడ అమ్మలూ నాన్నలూ పిల్లల్ని ఎత్తుకొంటున్నారు. వాళ్ళ భుజానున్న బాగ్గులు తమ భుజాల మీద వేసుకుంటున్నారు. వేళ్ళు పట్టుకొని నడిపిస్తున్నారు. తలలు చెరుపుతున్నారు. శివా, నాన్నా కూడా వాళ్ళిదరి లోకంలో వాళ్ళున్నారు. నాన్న శివ ముఖంలోకి చూస్తూ అడిగాడు:

‘‘చిన్నిమామా… ఏం చేసేవే ఇవాళ?’’

‘‘ఆ…?’’

‘‘స్కూల్లో ఏం చేశావూ… అంటున్నా’’

‘‘ఏబీ చదుకున్నా. చదుకుంటే… స్కేలు కొట్టింది’’

‘‘టీచరు కొట్టిందా?’’

శివగాడు ఇంకోవైపు చూస్తూ అక్కడ ఎవరో ఉన్నట్టు చూపుడువేలు గాల్లో ఆడించి, ‘‘ ‘దెబ్బపడతయ్!’ చెప్పింది. మెప్పెట్టేసింది ఇక్కడా…’’ అన్నాడు భుజం చూపిస్తూ.

‘‘మరి కొట్టరా, చదూకోపోతే?’’

‘‘స్కూల్ బాలే.’’

‘‘తప్పమ్మా. ఏబీ చదుకోవాలి. ఏబీ చదూకుంటేనే డబ్బులొస్తాయి.’’

‘‘ఆ?’’

‘‘డబ్బులొస్తే ఐస్క్రీమ్, లాలీపాపా కొనుక్కోవచ్చు’’

‘‘లాలీపాప కొనేస్తావా?’’

‘‘ఇప్పుడు కాదే. స్కూలెల్లి ఏబీ చదూకొంటే ఆఫీసెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు’’

‘‘లాలీపాప కావాలి.’’

‘‘రేపు కొంటా, స్కూల్ వెళ్తావ్ కదా, అప్పుడు.’’

‘‘స్కూలెల్లను అస్సల’’

‘‘తప్పలా అనకూడదు’’

‘‘స్కూల్ బాలేదే.’’

‘‘సర్సరే… రేపు చూద్దాం. అమ్మ అప్పచ్చి చేసింది తిందాం పద.’’

‘‘…లాలిపాపా?’’

నాన్న తలుపు తీసి లోపలికి వెళ్ళాడు.

అమ్మ వంటింట్లో మూకుట్లో ఏదో తిప్పుతూ వీళ్ళని చూసింది.

నాన్న శివగాడ్ని వొళ్ళో కూచోపెట్టుకొని షూ, సాక్సులు విప్పుతూ, వెనక్కి చూస్తూ చెప్పాడు, ‘‘ఇదిగో నీ కొడుకు స్కూలుకెళ్లడంట.’’

‘‘ఏంటీ అప్పుడే!’’ అంది అమ్మ.

‘‘టీచర్ కొట్టిందట.’’

అమ్మ గరిటె గట్టు మీద పెట్టి హాల్లోకి వచ్చింది. నడుం మీద చేయి వేసి నిలబడింది. స్కూల్లో చేర్చి ఇది నాలుగో రోజే. వాళ్ళ కొడుకు మీద ఇంకోళ్ళు చేయి చేసుకోవడం అంటే ఇంకా అలవాటు కాలేదు ఇద్దరికీ. ‘‘కొట్టిందా? ఏరా నాన్నా.. మిస్ కొట్టిందా?’’

శివగాడు తలూపాడు.

‘‘అదేం పొయ్యేకాలం దానికీ. నువ్వెళ్ళి అడక్కపోయావా?’’

‘‘ఏం అడుగుతామే. టీచర్లన్నాకా ఓ దెబ్బెయ్యరా? నువ్వూ నేనూ తినలేదా?’’

‘‘ఐతే మాత్రం! ఆడెంత ఉన్నాడనీ. వెళ్ళి చెప్పాల్సింది.’’

శివగాడు మధ్యలో మాట్లాడాడు, ‘‘ఏబీ రాయ్… దెబ్బపడతయ్ చెప్పి… స్కేల్ కొత్తింది.’’

అమ్మ వాడ్ని నాన్న వొళ్ళోంచి ఎత్తుకొంది. ‘‘రా నాన్న… నా తల్లే బంగారం. స్కేల్తో కొట్టిందా. ముండ. నువ్వెళ్ళి చెప్పాల్సింది ప్రిన్సిపాల్‌కి.”

‘‘ఏం చెప్తామే. మళ్ళీ చెప్పామని తెలిస్తే వీడి మీదే ఉంటుంది వాళ్ళ దృష్టంతా,’’ అన్నాడు నాన్న.

‘‘నిజమేలే. ఓమ్ తల్లి. చిన్నిముండ. కొట్టదులే, నాన్న చెప్తాడు. గులాబ్ జామ్ చేశా తింటావా?’’ అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

‘‘స్కూలెల్లను,’’ అన్నాడు శివగాడు.

నాన్న హాల్లో చొక్కా బొత్తాలు విప్పుకుంటూ గట్టిగా అన్నాడు, ‘‘ఆ వెళ్ళకు! ఇంట్లోనే అడుక్కోడిపెట్టలా కూర్చొనీ, గుడ్లెట్టు. మూడెళ్లి నాలుగొస్తుంది, సిగ్గులేదు మళ్ళా’’.

శివగాడ్ని నడుం మీద పెట్టుకునే అమ్మ గరిటె తిప్పుతోంది. ‘‘ఆ చదివినంతే చదువుతాడు. నువ్వు పెద్ద చదివేసేవా, నేను చదివేసేనా, ఈడిప్పుడు ఊడబొడిచెయ్టానికి. చిన్నపిల్లోణ్ణి పట్టుకుని ఊరికేని. ఏంరా.. బుజిముండా…’’

‘‘వంట తినాలా మనం…?’’

‘‘ఊ… అయిపోయింది. చల్లారేకా, గిన్నెలో పెడతాను. తిందుగానీ.’’

‘‘చాల వేడిగా ఉంతదా…’’

అమ్మ వాడి బొజ్జ మీద రుద్దింది. ‘‘ఆకలేస్తుందా చిచ్చితల్లికి,’’ అంది. వాడికి కితకితలొచ్చి నవ్వాడు.

బయట నెమ్మదిగా చీకటిపడింది. నాన్న లుంగీ కట్టుకుని మంచం మీద వాలాడు. ఆఫీసులో విషయాలు ఆలోచిస్తూ కణతలు నులుముకొంటున్నాడు, బనీన్లోంచి గుండెల మీద రాసుకుంటున్నాడు. చివరికి మోచేతిలో ముఖం పెట్టుకుని కునికాడు. కాసేపటికి వీపు వెనక ఎవరో ఆనుకున్నట్టు అనిపిస్తే మెలకువ వచ్చి చూశాడు. శివగాడు అటు తిరిగి కూర్చున్నాడు. చేతిలో కారుబొమ్మ పట్టుకొని, పైన గోడ మూలలోకి అక్కడేం లేకపోయినా చూస్తున్నాడు.

నాన్నకి వాణ్ణలా చూస్తే ముచ్చటనిపించింది. వాడెంత సేపుకీ కదలకపోతే “చింతల్లీ…” అని పిలిచాడు.

శివగాడు ‘‘ఉం’’ అని తిరిగి చూశాడు.

నాన్న వాడి చంకల్లో చేతులేసి గుండెల మీదికి లాక్కొన్నాడు. వాడు రానన్నట్టు గింజుకుంటూ బరువుగా వచ్చాడు.

‘‘ఏం చూత్తన్నావే? పిచ్చిముండ’’

శివగాడు సిగ్గుగా నవ్వి కారుబొమ్మ వేపు చూశాడు. వాడిలోపల ఏముందో అని నాన్నకి బాధగా అనిపించింది.

‘‘అమ్మేదిరా?’’ అని అడిగాడు.

శివగాడు ‘‘లాల’’ అని బాత్రూం వైపు చూపించాడు, చెంబుడు నీళ్ళు పడిన చప్పుడు వైపుకి.

‘‘బజ్జో కాసేపు’’ అని చంకల్లోకి పడుకోపెట్టుకున్నాడు నాన్న.

శివగాడు కారుబొమ్మ గుండెల మీద పెట్టుకొని నాన్న చంకలో పడుకొని ఫ్యాన్ వైపు చూస్తున్నాడు.

నాన్నకి మళ్ళీ ఆఫీసు గుర్తొచ్చింది. అక్కడ ఉన్న ఇబ్బంది ఏదో ఉండకపోతేనో అనీ, ఆ పరిస్థితిలో తను ఇంకోలా మాట్లాడివుంటేనో అనీ, మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తే ‘అప్పుడు ఇలా అనాలి’ అనీ ఆలోచించుకుంటున్నాడు.

మధ్యలో ఒకసారి శివగాడు పిలిస్తే చంకలోకి చూసాడు.

శివగాడి కళ్ళు దగ్గరగా పెద్దగా కనిపించాయి. ‘‘స్కూలెల్లాలా?’’ అంటున్నాడు.

నాన్న వాడి బుగ్గలు నలిగేలా గుండెల మీదికి లాక్కొన్నాడు. ‘‘చదూకోపోతే ఎలారా మరీ,’’ అన్నాడు.

శివగాడు ఇంక ఏడుపుగొంతుతో గట్టిగా మాట్లాడాడు, ‘‘స్కూలు బాలేదే…! బాబులు బాలేదు. ఆంతీ బాలేదు. జారీ బల్ల బాలేదు. బాలేదు అసల!’’

‘‘సర్సరె. రేపటి సంగతి కదా. నేను చెప్తాన్లే టీచరుతోటి. టీచరండీ, మా శివని కొట్టద్దండీ. బంగారుతల్లీ, బాగా చదువుకుంటాడూ అని చెబుతాగా రేపు వచ్చి? చెప్పనా?’’

‘‘వొద్దు’’

‘‘మరి వెళతావా?’’

‘‘వొద్దు, బాలేదసల.’’

అమ్మ బాత్రూంలోంచి కొత్త నైటీలో వచ్చింది. ‘‘ఊరికే ఎందుకు రాపాడించేస్తన్నావు పిల్లోడ్ని పట్టుకొనీ. వెళ్ళాపోతే మానేస్తాడు. ఏది పట్టుకుంటే అదేనబ్బా మనిషికి…,’’ అంది అద్దం ముందర జుట్టు తువ్వాల్తో రుద్దుకుంటూ.

శివగాడు చప్పున నాన్న చంకలోంచి లేచివెళ్లి అమ్మ కాలిని కావలించుకున్నాడు. ‘‘అమ్మా… స్కూలెల్లనే,’’ అన్నాడు పైకి చూస్తూ.

‘‘వెళ్ళద్దు తల్లీ. నాన్న అలాగే అంటాడు బుద్ది లేదు అస్సలు.’’

‘‘స్కూలెలు ఎలు అంతున్నారు,’’ నాన్నని వేలుపెట్టి చూపించాడు.

‘‘నీకేవే, కూర్చొని ఎన్నయినా చెబుతావు. ఐదు వేలు కట్టొచ్చానక్కడ. లెక్కాపత్రం లేకుండా పోతుంది అమ్మా కొడుకులికి. యూనిఫాం అయిపోయింది వచ్చి తీసుకోండని ఆ టైలర్ గాడు రెండోసారి ఫోన్ చేసాడు. జీతం పడనియ్యరా బాబూ అని నా బాధ,’’ అన్నాడు నాన్న.

‘‘అసలు ఫీజంతా ఒకేసారి ధారబోసెయ్యమని ఎవడు చెప్పాడు నీకు. మూడు టెరంలు కట్టొచ్చు. అంతా నాకే తెలుసని బయల్దేరతావు. నోరిప్పి మాట్లాడితే కదా అసలు.’’

‘‘ఓ నెల ఉండొచ్చు, ఓ నెల వుండాపోవచ్చు. ఉన్నప్పుడే కట్టిపడేస్తే వదిలిపోతుంది కదాని.’’

‘‘ఆ… మరిప్పుడు వాడెళ్ళనంటనాడు ఏం చేస్తావు?’’

‘‘అంటాడంటాడు. వాడిష్టమూ, నీ ఇష్టమూని. ఎన్నో రోజని చేరి? ఓ రెండ్రోజులెళ్తే మూడో రోజుకి అదే అలవాటవుతుంది’’

శివగాడు అమ్మ వైపుకీ, నాన్న వైపుకీ మార్చి మార్చి చూస్తున్నాడు. ఇంక తనే మాట్లాడాలని ముందుకొచ్చాడు. ‘‘స్కూలెల్లనసల! బాలేదు స్కూలు. స్కేలు కొత్తింది. మెప్పెస్తుంది,’’ అన్నాడు గట్టిగా.

‘‘నోర్ముయ్యరా. వేషాలు,’’ అని గొణిగి నాన్న మళ్ళీ మోచేతిలో ముఖం పెట్టుకున్నాడు.

ఈలోగా తలుపు దగ్గర్నుంచి, ‘‘పాలండీ!’’ అని వినిపించింది. అమ్మ శివగాడ్ని “ఊండునానా,” అని విడిపించుకుని గిన్నె కోసం వంటగదిలోకి వెళ్ళింది.

శివగాడు మంచం మీద కారు బొమ్మ వైపు చూశాడు. దాన్ని తీసుకోకుండా చేతులు వేలాడేసుకుని గుమ్మం వైపు నడిచి వెళ్ళాడు. పాలాయన వీడ్ని చూసి, ‘‘టిర్రిక్,’’ అని నాలికతో చప్పుడు చేశాడు.

శివగాడు నవ్వనా మాననా అన్నట్టు నవ్వాడు.

‘‘పాలు తాగుతున్నావా రోజూనీ?’’ అని అడిగాడు ఆయన వంగి.

‘‘ఆ?’’

‘‘పాలు… పాలు తాగితే బలమొస్తాది. చూడు కండలు,’’ అని చొక్కా చెయ్యి పైకి లాగాడు.

శివ కూడా చొక్కా చేయి లాగి చేతిని చూపించాడు. ‘‘బలం!’’

తాత ‘‘అబ్బో’’ అన్నాడు.

తర్వాత శివగాడు ముఖం మార్చుకుని తాత దగ్గరికి వెళ్ళి, ‘‘స్కేలు కొత్తింది,’’ అని చొక్కా చేతిని భుజం దాకా లాగి చూపించాడు.

శివ వాళ్ళమ్మ గిన్నెతో వచ్చింది. ‘‘ఇంకో రెండ్రోజు లాగాలండీ, జీతాలింకా పళ్ళేదు. మొత్తం నాలుగు నాగాలు,’’ అంది.

‘‘చూడండమ్మా… చిట్టీలున్నాయి కట్టాల్సినయి,’’ అన్నాడు పాలాయన తలగోక్కుంటూ.

శివ చొక్కా కిందికి లాక్కుని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. మంచం ఎక్కి, నాన్న వీపుకి వీపు ఆనించి, కారు బొమ్మని కావిలించుకున్నాడు. చాలాసేపు కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నాడు.

ఆఫీసులో గొడవలేవో పెరిగిపెద్దవైపోయినట్టూ, ఉద్యోగం ప్రమాదంలో పడేదాకా వచ్చినట్టూ, ఏవేవో పిచ్చిపిచ్చి కలలొచ్చి నాన్నకి అర్ధరాత్రి ఎప్పుడో మెలకువొచ్చింది. ఇటు తిరిగి చెయ్యేస్తే శివగాడు తగిలాడు. మోచేతి ఊతంతో తలగడ మీద లేచి వాడి ముఖంలోకి చూశాడు. నుదురంతా చెమట చుక్కలున్నాయి. నాన్న వాడి లోకంలోకీ, కలల్లోకీ వెళ్ళాలని ప్రయత్నించాడు, వెళ్ళలేకపోయాడు. కాసేపు నిద్రపోయిన ముఖంలోకి చూశాడు. వాడ్ని మెల్లిగా తలగడ మీదకి లాగి, సందిట్లో పొదువుకొని, వాడి చిన్ని పొట్టని చేత్తో నిమురుతూ మళ్ళీ పడుకున్నాడు.

**** (*) ****

Wednesday, 2 November 2016

శివరాఘవ

శివరాఘవ https://animoto.com/play/Xa1MeAo5i36m20ETCDwiBg

శివరాఘవ

మెహెర్ శివ రాఘవ ................

నీ పేరేంటి. శ్రీ రాఘవ, మరి నాపేరో........... శాంతి, మరి నాన్న పేరో ఫణి కుమార్. అంటున్నావ్ రా. ఇన్నాళ్ళకు నీకు మాటలు వస్తున్నాయ్. చాలా ఆనందంగా ఉంది మాకు. నీ ముద్దు మాటలతో మా పెదాలపైన ఎప్పుడూ చిరునవ్వులే.

చిన్నతల్లికి ఈమధ్య అడిగి కొనిపించుకోవడం కూడా తెలిసిపోయింది. నాన్నా ఐచ్ కీం కావాలి. చాకీ కూడా...... బిచెట్టు తే..... నాన్న. అంటావ్.

బుజ్జిగాడు బుజిబుజి అడుగులు వేసుకుంటా ట్యూషన్ కి కూడా వెళుతున్నాడు. అక్కడ చదివేది కన్నా ఆడుకునేదే ఎక్కువ. చాలా గడుగ్గాయ్. వాళ్ళని ఓ ఆట పట్టించి గానీ వదలవ్.





Tuesday, 7 April 2015

ఆ మాత్రం చాలని



నీళ్ళంటే నీకు ఇష్టం
టబ్బులో అనుభవం తాకని నీ శరీరం
ఆనందం కేరింతలుగా పొంగి పొర్లుతుంది
మీ నాన్నకి నిన్నలా చూడటం ఇష్టం.

నీ ముందు తెరుచుకునే కాలాన్ని ఊహిస్తాడు:
నడుస్తావు తోవలో ఎత్తు పెంచుకుంటూ
శరీరం ఋతువుల రాపిడికి గరుకెక్కుతుంది
మనసు దృశ్యాలతో బరువెక్కుతుంది
నిర్ణయాలు తీసుకుంటావు
ప్రేమిస్తావు రమిస్తావు
బాధిస్తావు బాధపడతావు
పెంచుతావు పోషిస్తావు, మీ నాన్న లాగే.
రాలిపోవడం చూస్తావు, మీ నాన్నతో సహా.

రక్తకణాలు పునర్జన్మిస్తూంటాయి
న్యూరాన్లు నిండుతాయి
వెంట్రుకలు రంగుమారతాయి

చప్పుడు చేసే కీళ్ళతో ఏదో కారిడార్లో గదులు వెతుక్కుంటావు
నములుబడని పదార్థం కావాలనిపించినా వద్దంటావు
గుమ్మం చూపించే దృశ్యాన్ని మంచం మీంచి చూస్తూంటావు
కన్నీరు చర్మం మడతల్లో ఎలా ఇంకుతుందో తెలుస్తుంది.

కేరింతల్లేని అప్పటి నీ పసితనాన్ని మన్నించి
వంగిన నీ వెన్నుపై సబ్బు రుద్దే ఒక్క మనిషినైనా
సాధించుకునేపాటి తెలివి మాత్రం నీకుంటే చాలని
కోరుకుంటాడు మీ నాన్న
నిన్ను టర్కీటవల్లో చుట్టబెట్టి తీసికెళ్తూ.

Tuesday, 21 October 2014

నాకు జర్రమొచ్చిందో..........

రాత్రి 9గంటలకు నాన్నమ్మతో కెమెరాలో మాట్లాడానా అరటి పండు తిన్నానని నాకు వేడినీళ్ళతో స్నానం చెయించాడు నాన్న. నాన్నకు నా ముఖం తోమడం రాదు కాస్త నీళ్ళు ఎక్కువపోసాడేమో తాగేశాను. అంతే ఇక అక్కడినుండీ జలుబు మొదలైంది. దానిలోనే జ్వరం, ఆయాసం, వాంతులు ఒకదానితరువాత ఒకటి అయిపోయాయి. అమ్మ కంగారు పడిపోయింది. నాన్న పరవాలేదన్నా ఏదో భయంగానే ఉంది తనకు. ఇక రాత్రంతా నేను నిద్రపోలేదు, అమ్మనాన్నలను నిద్రపోనీయలేదు. తెల్లవారాక కూడా అదే పరిస్థితి మళ్ళీ వాంతులయ్యాయి. నాన్న ఆసుపత్రికి తీసుకుపోదామన్నాడు. అమ్మనేను నాన్న బయలుదేరాం. డాక్టర్ గారు నన్ను చూడగానే ఇవి నిమోనియా చాయలన్నాయి వెంటనే జాయిన్ చేసుకోవాలన్నారు. నన్ను డాక్టర్ గదిలో ఉంచుకుని నాన్నని, అమ్మని బైటికి వెళిపోమన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో బైట తెలియని నాన్న తెగ కంగారు పడిపోయాడు. నేను మాత్రం వాళ్ళు సెలైన్ పెట్టడానికి సూది గుచ్చినా ఏడవలేదు. అది చూసిఅందరూ తెెగ వింతగా చెప్పుకున్నారు.
నేను ఆసుపత్రిలో ఓరోజంతా ఉన్నాను.


ఈమధ్య అసలు బాగాలేదు నాకు ఒకటే జ్వరం తగ్గుతుంది వస్తుంది. అంతా కంగారు పడుతున్నారు. అమ్మకు నావల్ల పనిపెరిగింది. నాన్నకు బిల్లు పెరిగింది. నాకు నీరసం పెరిగింది. ఇదీ సంగతి. వేలతో నయం కాని నా జ్వరం నాన్నమ్మ హోమియో పతి మందుతో నయం అయిపోయిందని నాన్నఅమ్మ తెగ చెప్పుకుంటున్నారు.

ఇక నాయనమ్మ నాగురించి ఫోన్లో సమాచారం కనుక్కోవడంతో సరిపోతుంది. ఇప్పుడన్నీ తగ్గాయనుకుంటుంటే మళ్ళీ అమ్మవారు పూసింది ఇది ఎప్పుడు తగ్గుతుందో మరి. :(

Tuesday, 23 September 2014

చినతల్లికి, నాన్న



బండి మీద వెళ్ళేటప్పుడు ఇదివరకు కూడా కనపడేవి కొన్ని హోర్డింగులు. జాలికళ్ళతో ఒక పసిపిల్లో పిల్లోడో కెమెరా వైపు చూస్తుంటారు, పక్కన కేప్షన్ ఉంటుంది, బండిజోరు తగ్గించమని సూచిస్తూ “మీ కోసం మీ కుటుంబం ఎదురుచూస్తోంది” అనో ఇంకోటో. అలాంటి ప్రకటనలు చూసినపుడు నేను వాటిల్లో క్రియేటివిటీ గురించి ఆలోచించేవాణ్ణి. “వీళ్లు భలేగా ఎమోషనల్ స్పాటు చూసి కొడుతున్నార”ని అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వొకడివి వచ్చి నన్ను నాన్నని చేసి నిలబెట్టాకా, అలాంటివి తిన్నగా నన్ను అడ్రెస్ చేస్తున్నాయి. బండి నడిపేటపుడు ఇదివరకట్లా ఎదర వున్న దాన్నల్లా దాటేసిపోవాలనే తొందర ఉంటం లేదు. ఇలా చిన్నచిన్న విషయాలు మొదలుకొని నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నావు నువ్వు. చాపకిందనీరు లాంటిది నీ మోహరింపు.

నువ్వు రాకముందు తండ్రిహోదా పట్ల నాకు కేవలం ఎవల్యూషనరీ ఇంట్రెస్టు మాత్రమే వుండేది. తండ్రి కావటం అంటే ఒక మనిషి జీవపరిణామ దశలన్నింటినీ అతిదగ్గరగా పరికించే అవకాశమని మాత్రమే తోచేది. అప్పుడు కూడా ఆ మనిషి ఒక స్త్రీయే కావాలనుకునేవాణ్ణి. నా బిడ్డలకోసమని నేను ఏరివుంచుకున్న పేర్లన్నీ అమ్మాయిలవే (అందుకే నీ పేరు పెట్టే అవకాశాన్ని పూర్తిగా అమ్మకే వదిలేశాను). అక్కలూ చెల్లెళ్ళూ మరదళ్ళూ మేనకోడళ్ళూ ఎవరూ లేకపోవటం వల్ల నాకు ఆడాళ్ళు ఎందుకు అలా ఉంటారు అనేది ఎప్పుడూ గోడ ఆవలి రహస్యమే. వారి స్నిగ్ధమైన ప్రపంచాలకి (జడరిబ్బన్ల, పూలదండల, డాన్స్‌క్లాసుల, సాయిబాబాగుడుల, హాండ్‌బాగుల, స్కూటీల ప్రపంచానికి) మొట్టమొదటి ఆంతరంగికుడిగా ఉండగలగటం నా దృష్టిలో అద్వితీయమైన పదవి. ఆ లోటు అలాగే ఉంది. కానీ అది అదే, నువ్వు నువ్వే.

ఆ ఎవల్యూషనరీ ఇంట్రెస్టు కూడా ఇప్పుడేం లేదు. సరే నువ్వంటూ ఉన్నావు గనుక, నీ ఎదుగుదల అంటూ నా కళ్ళ ముందు జరుగుతోంది గనుక, ఆ ముచ్చటా తీరుతున్నా, నన్ను నీ వైపు పట్టిలాగే కారణాల్లో అది వెయ్యోవంతు కూడా కాదు. మరి ఏమిటీ అంటే, అవేంటో తెలిస్తే ఇదంతా రాసే సందర్భమే కలిగేది కాదేమో. లేదూ, నిజానికి ఇదంతా బడాయేనేమో, మనిషిని కాబట్టి బుద్ధి కలిగించే అహంభావం వల్ల దీన్నంతట్నీ కేవలం ఒక జంతుసహజాతంగా చూడలేకపోతున్నానేమో. For all i know, ఇప్పటికైతే నీ మీద ఇష్టం నువ్వు ఒక కీ ఇవ్వకుండా ఆడే బొమ్మవి కావటం వల్లనే మాత్రమేనేమో.

నీ మీద నా ఇష్టం పూర్తిగా మానసికమైనదే కాదు; నాకు నువ్వో స్నిగ్ధమైన చర్మంతో కప్పివున్న చిన్ని అవయవాల చలిమిడిముద్దగా కూడా నచ్చుతావు. నీ చర్మం క్వాలిటీని స్నిగ్ధమని సరిపెట్టేయలేము. కాలపు కరుకురాపిడికి అది మున్ముందు నాకు నిగూఢమూ, నానుంచి భిన్నమూ, మరో అన్‌టచబుల్ సమక్షమూ అవుతుందని తెలుసు. ప్రస్తుతానికైతే నిన్నెత్తుకున్నప్పుడు నన్ను నేనే మోస్తున్నట్టు ఉంటుంది. ఎంత పీల్చినా సారం ముక్కుతో పాటూ తీసుకెళ్దామంటే పట్టుబడని నీ వాసన బాగుంటుంది. ఎత్తుకున్నప్పుడు నీ మెడలో ముక్కుదూర్చి పీలుస్తూంటాను. కానీ నువ్వు నా గడ్డం పెట్టే చక్కిలిగిలికి నవ్విస్తున్నాననుకుని నవ్వేస్తూ ఉంటావు. ఈమధ్య నీకు కింద వో రెండు పళ్ళు మొలిచాయి. దాంతో ఇప్పటికే నా పేలవమైన పెన్నుకి వర్ణనాతీతమైన నీ నవ్వు ఇప్పుడింకా అందని దూరమైపోయింది.

ప్రస్తుతానికి నువ్వో pure animal వి. ఇది రాస్తున్నప్పుడు కూడా, నాకు దూరంగా నేల మీద దొర్లాడుతున్న నువ్వు నా వైపు పాక్కొచ్చి ఈ కాగితం చింపటానికి ట్రై చేస్తున్నావు. అది కుదరనివ్వకపోవటంతో, నా జుట్టుని పట్టుకుని కిందకు గుంజే ప్రయత్నంలో పడ్డావు, అదైన తర్వాత ఇప్పుడు నా పక్కకు వచ్చి నిన్నూ నీ మొహాన్ని నా భుజంకేసి రాసుకుంటున్నావు. ఊరికే చెంగనాలు కడుతూ మధ్యమధ్యలో తల్లిని ఒకసారి ఒరుసుకుని మళ్లీ వెళ్ళిపోయే దూడకన్నా ఏమంత భిన్నం కాదు నువ్విప్పుడు. (ఆ తల్లికన్నా నేనూ ఏమంత భిన్నం కాదు. సుమతీసూక్తికి భిన్నంగా నాకు పుత్రోత్సాహం కలిగించటానికి నీ కేవలమైన ఉనికే సరిపోతుంది; చివరకు ఫేస్బుక్లో పెట్టిన నీ ఫొటోకి వచ్చిన లైకులు కూడా సరిపోతున్నాయి.)

అయినా నీ వైనాల్లో ఒక వ్యక్తిత్వాన్ని చదవటానికి విపరీతంగా ప్రయత్నిస్తుంటాం మేం. నాకన్నా ముఖ్యంగా అమ్మ. నీ అన్ని చర్యలూ తనకి ఉద్దేశపూర్వకమైనవిగా కనపడతాయి. ఆ ఉద్దేశాల్ని గెస్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నట్టు, విశదంగా తెలిసిపోతున్న విషయాల్లా మీ అమ్మ చదివి చెప్పేస్తూంటుంది. నేను మాత్రం ఇంకా నీ చర్యలకి బయటి ఉద్దీపనల్నే తప్ప, నీ లోపలి ఉద్దేశాల్ని కారణంగా చూడలేకపోతున్నాను. నువ్వు నాలిక బయటపెట్టి ఆడిస్తున్నప్పుడు తనని వెక్కిరిస్తున్నావంటుంది మీ అమ్మ. కొత్తగా వచ్చిన నీ పళ్ళ పదును మీద సరదాగా నాలిక ఆడిస్తున్నావంటాను నేను. ఇలాంటి నీ వేషాల్లో ఏమాత్రం తేడాగా అనిపించినా అది సహజమేనని ఇంటర్నెట్లో వెతికి ఖాయం చేసుకునేదాకా ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు.

కానీ నా మనసంతా ఇలా రంగురంగుల బెలూన్లమయం మాత్రమే కాదు. వాటిని గుచ్చి పేల్చే శంకలూ ఉన్నాయి. అప్పుడప్పుడూ ఏమనిపిస్తుందంటే, ఇన్ని కోట్లమంది లోకజ్ఞులూ సజ్జనులూ ఋజువర్తనులూ ఐన మగవాళ్ళున్న లోకంలో, నువ్వు ఇలాంటి ఒక మగవాడి హయాంలోకే వాడినే తండ్రిగా చేస్తూ ఎందుకు ఊడిపడ్డావా అని. అప్పుడు నీ మీద ఒక తటస్థమైన జాలి కలుగుతుంది. ఎందుకంటే, అలా ఎలా కుదిరిందో చెప్పలేనుగానీ, నేను ఒక సామాజిక మానవునిగా ఎదగలేదు. కనీసం పైపై అప్పియరెన్సెస్ వరకూ పద్ధతైన సంసారి వేషాన్ని ఎలాగో నెట్టుకొస్తున్నాను గానీ, నా మనసు ఏ విలువనూ అబ్సొల్యూట్‌ అని నమ్మదు, ప్రతి అవధికీ కన్నాలు తవ్వి అవతలికి దూరుదామని చూస్తుంది. ఇలాగుండటంపై నాకు ఏ ఫిర్యాదులూ లేవు సరికదా గొప్పగా కూడా ఫీలవుతుంటాను. కానీ ఈ స్థితికి వచ్చే క్రమంలో మనసు చేసిన ప్రయాణం సురక్షితమైంది కాదు. అది ఆవలించే లోయల పైన బార్బ్‌డ్‌వైరు మీదుగా దొమ్మరి నడక. ఇప్పటికీ చాలా డెలికేట్ బాలెన్సే. అలాంటి ప్రయాణం నువ్వు చేయటం నాకు ఇష్టం లేదు. ఈ స్థితికి నువ్వు చేరటం ఇష్టం లేదు. అదికూడా కేవలం ఇలాంటి ఒక నేను నీ తండ్రినవ్వటం అన్న కారణంగా జరగటం అస్సలు ఇష్టం లేదు. లోకపు లౌక్యపుటిరుసుకి ఏ రాపిడీ లేకుండా కందెన సులువుతో ఒదిగి సాగిపోవాలి నీ జీవితం. (ఒక్కోసారి నువ్వు పుడుతూనే నాలో ఎక్కడో స్టాప్‌వాచీని క్లిక్ చేశావనిపిస్తుంది. నాకు ఎంతో టైం లేదు. మరీ నిన్ను అయోమయపరిచేంత బొహేమియన్ వాతావరణం ఏం లేకపోయినా, ఉన్న కాస్త అస్తవ్యస్తాన్నీ చక్కదిద్దుకుని నిన్ను లోకరీతికి అనుగుణంగా పెంచగలిగే నాన్నలాగా మారిపోవాలి. క్లాక్ ఈజ్ టికింగ్!)

అలాగని మళ్ళీ నువ్వు అందరుపిల్లల్లాగా పెరగటం కూడా ఊహించుకోలేను. ఆ పసుపురంగు స్కూలు బస్సుల కిటికీల్లోంచి కనిపించే అనేక యూనిఫారాల్లో ఒక యూనిఫాంగా నువ్వు మారటం నాకిష్టం లేదు. నాన్ననో ధృవనక్షత్రంగా చూసే అమ్మ మరీ నాన్న లోకంలోకి ఇమ్మెర్స్ అయిపోయి అవును వీణ్ణి బడికిపంపవద్దంటూ వంతపాడటం మొదలుపెట్టింది గానీ, నాన్నకైనా బుద్ధుండాలిగా. స్కూలుకి పంపక ఏం చేయను. నగరంలో బతక్క ఏం చేయను. ఈమధ్య నిన్ను ఎత్తుకుని బయటకు తీసుకెళ్ళినపుడు మరీ అనిపిస్తుంది. నువ్వు నా భుజం మీద చుబుకం ఆన్చి వచ్చే పోయే కార్లనో, బైకుల్నో చూస్తూంటావు. గట్టిగా హార్న్ వినపడినప్పుడల్లా ఉలికిపడతావు, అహ, పడేవాడివి, ఇప్పుడు అలవాటుపడిపోయి అటు మామూలుగా చూస్తావు. నిన్ను అలా తీసుకెళ్ళి నా బాల్యాన్ని ఆవరించిన దృశ్యాల్లాంటివి చూపించాలని ఉంటుంది. బాటంతా గొద్దెలమయం చేసే మేకలమందల్నో, అష్టాచెమ్మా ముగ్గులు గీసున్న రామాలయం గచ్చునో, మాగన్ను మధ్యాహ్నాలు చల్లగా గలగలల సందడి చేసే రావిచెట్టునో, నత్తలు రథం ముగ్గులేస్తున్న ఆఖరి కోనేటిమెట్టునో, కోసిన పొలంలో గడ్డిమేటు వెనుక కుంగే మెత్తటిబింబాన్నో చూపించాలని ఉంటుంది. నా బాల్యానికి అవన్నీ ఉన్నాయి. నిన్ను మాత్రం ఒక కరుకైన లోకంలోకి తీసుకొచ్చి పడేశాను. ఇది ట్రాఫిక్‌ వల్లనూ, కాంక్రీటు వల్లనూ మాత్రమే కరుకైన లోకం కాదు. శివార్లలో గొంతులుకోసే ముఠాలు తిరిగే లోకం, తల నుంచి గోనెసంచులు వేలాడే పిల్లలు చెత్తకుప్పల్లో ఇనుపచువ్వలు పుచ్చుకుని పాలిథీన్ కాగితాలు ఏరుకునే లోకం, లిప్తమాత్ర యథాలాపపు డ్రైవింగ్ వల్లనే పుచ్చెలు పగిలి చచ్చే అవకాశాలతో కిక్కిరిసిన లోకం, భుక్తిరీత్యా నిత్యం కదుల్తూనే తప్ప నిలకడగా నిలబడిన మనుషులు అరుదుగా కనిపించే ప్రాగ్మాటిక్ లోకం.

మరి ఇలాంటి చోట్ల పిల్లలు పుట్టటం లేదా ఆరోగ్యవంతంగా పెరగడం లేదా అనొచ్చు. ఆమధ్య కొన్నాళ్లపాటు చిత్రమైన రీతుల్లో సమాధానపడేవాణ్ణి. సృష్టిలో ప్రతీదీ ఆ నూటపద్దెనిమిది రసాయనికమూలకాలతో నిర్మితమైనదే కదా. మరి, అవే మూలకాల్లో కొన్నింటితో తయారైన చెట్టుని అందమనీ, ఇంకొన్నింటితో తయారైన కాంక్రీటు భవనాన్ని వికారమనీ ఎందుకు అనుకోవాలీ అనీ ఇలా. కానీ అందమూ వికారమూ కాదు అసలు డిస్టింక్షను. సహజమూ అసహజమూ, ఇంకోలా చెప్తే ప్రకృతిసహజమూ మానవనిర్మితమూను. ప్రకృతి పరివృతమై పెరిగిన బాల్యం ఆలోచనకి కలిగించే విశాలత్వం వేరు. ఎదిగాకా అది చుట్టూ లేకపోయినా, మెదడులో ఒక పచ్చటి విశాలమైన అర అలా ఉండిపోతుంది. అది ఎంత రద్దీలోనైనా నిమ్మళాన్ని ఇస్తుంది. ఎంత ఇరుకులోనైనా వెసులుబాటు ఇస్తుంది. నీకు అది లేదు. నువ్వు కంప్లయిన్ కూడా చేయలేవు. ఎందుకంటే నీకు ఇది తప్ప ఇంకోటేదీ తెలియదు. ఎంపికకి అవకాశం లేదు. అదింకా విషాదం. నిజంగా నువ్వే నా మొట్టమొదటి ప్రయారిటీవైతే వెంటనే ఊరెళిపోయి ఏ కిరాణాషాపో పెట్టుకోవాలి. కానీ ఇందాక చెప్పినట్టు ఎదిగే క్రమంలో ఎక్కడో నేనిలా నగరాటవిలో మాత్రమే శరణులభించే మృగంగా మారిపోయాను.

ఇవి చాలవన్నట్టు ఇంకో పెద్ద గుంజాటన ఉంది. బహుశా వీటన్నింటికీ అదే మూలమై నన్నిలా రాయిస్తుందేమో. నాకు నాన్న అనే శాల్తీ లేకపోవటం వల్ల నిన్ను పెంచటానికి నాకు ఒక మోడల్ లేకుండా పోయింది. అది మంచో చెడో నికరంగా చెప్పలేను గానీ, అది అలా ఉంది. ఒక చెడు ఎగ్జాంపుల్ ఉండుంటే మంచి వైపు వెళ్ళటం సులువయ్యేది, ఒక మంచి ఎగ్జాంపుల్ ఉండుంటే అనుసరించేవాణ్ణి. ఇప్పుడు నా రోడ్డు నేనే వేసుకోవాలి. నువ్వింకా పాకగలిగే చిన్నిప్రపంచంలో మాత్రమే ఉన్నావు కాబట్టి అదింకా పెద్ద కన్సెర్న్ కాదు. కానీ కొన్ని భయాలు. I fucked up so many relationships. I want us to be a success.


Friday, 19 September 2014

మానాన్నా నేను.........

మీనాన్న నువ్వు ఆడుకుంటుంటే భలే బాగుంటుందిరా చూడడానికి రెండుకళ్ళూ చాలవన్నట్టు ఉంటుంది. నీ చిట్టి చేతులతో నాన్న ముఖం తడుముతుంటే ఎంత ఆనందపడిపోతాడో నాన్న. నిన్ను చూసుకుని మురిసిపోతాడు. అలా చూస్తుండిపోతాను మిమ్మల్ని. నువ్వు తన గుండెల మీద జుట్టు ఎంత బలంగా లాగేసినా, రక్కేసినా అస్సలు నొప్పి అనేదాన్ని తన ముఖం మీద కనపడనీయడు. చూస్తూనేను మాత్రం నిన్ను తిడతాగానీ మీ నాన్న తెగ ఆనందపడిపోతుంటాడు. ఇద్దరివీ ఎన్ని ఫొటో ఫోజులున్నాయో.......













నాతో అమ్మానాన్న.......

ఎప్పుడూ నాకేనా ఫొటోలు మీరు కూడా తీయించుకుంటేనే నేను తీయించుకుంటాను ఫొటో అని ఈమధ్యన మారం చేస్తున్నాను. అందుకే కాబోలు మొన్న అమ్మ కాలేజీ పనిమీద వెళ్ళినపుడు అందరికీ కలిపి తీయించింది.ఎప్పుడూ తన చక్రాల్లాంటి కళ్ళను మూసేసే అమ్మకూడా ఈసారి మంచిఫోజులిచ్చింది. ఏకళ్ళనున్నాడోగానీ పూర్తిగా షేవ్ చేసుకొచ్చాడు నాన్నా, నేను ఇలా అన్నానని నన్ను కొట్టడానికి వస్తే మీరు ఆపండే నాన్నను నన్ను కొట్టనీయకండి.....








ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ ఇంతకముందు చూడలేదుకదా మేము ఏలా ఉన్నామో.... ......



చూడండి ఏలా ఉన్నాం. అమ్మకి నాకు వచ్చినట్టుకూడా రాదు ఫొటోకి ఫోజీయడం ఇక నాన్నయితే.....అబ్బో.....





ఈ రోజు చిన్న తాత వచ్చారోచ్.........

అవును నన్ను చూడడానికి చిన్నతాత చాలా దూరం నుండీ వచ్చారు తెలుసా..... నాతో చాలా ఆటలాడారు. ఎత్తుకున్నారు, బొజ్జో పెట్టారు. అసలు నన్ను వదలనేలేదు. సాయంకాలం వరకు నాతోనే ఉన్నారు తాత.....నాకు పాలకోవా తినిపించారు భలే ఆడుకున్నాం ఇద్దరం.ఈసారి వచ్చేటప్పుడు చిన్న నాన్నమ్మని కూడా తీసుకువస్తానన్నారు.





నేను పెద్దబాబాయిని చూసానోచ్.........


నాకోసం పెద్ద బాబాయి వచ్చినట్టు గుర్తులేదు.అప్పుడు నేను చాలా చిన్నకదా..... నా ఫొటోలు మాత్రం చూసాడని తెలుసు. అవునురా నీకు గురుతుందా మొన్న మనం మీ పెద్దబాబాయిని చూడడానికి వెళ్ళాము. అక్కడికే మీ పిన్నికూడా వచ్చింది. నీకు బొమ్మలు కూడా తెచ్చింది. పెద్ద బాబాయితో , నాయనమ్మతో ఎన్ని  ఫొటోలు దిగాం . అప్పటికి పిన్ని వెళిపోయింది. సరే అవి ఎంతబాగా వచ్చాయో చూడు........













Phaneendra - the moviemaker & Sreemaan - the troublemaker/ Neanderthal.

Nowadays I am feeling like a big Pro in art. I am not lying- Out of 1-10 I am at level 6.  *** I have been playing this video game called Sp...