Friday, 19 September 2014

నేను పెద్దబాబాయిని చూసానోచ్.........


నాకోసం పెద్ద బాబాయి వచ్చినట్టు గుర్తులేదు.అప్పుడు నేను చాలా చిన్నకదా..... నా ఫొటోలు మాత్రం చూసాడని తెలుసు. అవునురా నీకు గురుతుందా మొన్న మనం మీ పెద్దబాబాయిని చూడడానికి వెళ్ళాము. అక్కడికే మీ పిన్నికూడా వచ్చింది. నీకు బొమ్మలు కూడా తెచ్చింది. పెద్ద బాబాయితో , నాయనమ్మతో ఎన్ని  ఫొటోలు దిగాం . అప్పటికి పిన్ని వెళిపోయింది. సరే అవి ఎంతబాగా వచ్చాయో చూడు........













చిట్టల్లరి.....

 ఆ చూపు చూడండమ్మా అసలు ఎక్కడన్నా చిన్నపిల్లాడిలా ఉన్నాయా ఆచూపులు ఏదో కొరుక్కు తినేస్తానన్నట్టు లేదా తంతానన్నట్టు లేవు.అప్పుడే పెద్దాడిని అయిపోయాను అనుకుంటున్నావుకాబోలు వేసిన డైపరు విప్పేసుకోడాలు, స్నానానికి టబ్బులో వేస్తే బైటికి రావడానికి జంపింగులూనూ, నీ అల్లరితో కాస్త విసుగువచ్చినా, నీ నవ్వుతో పోగొట్టేస్తావురా...... ఈమధ్య నీకు పళ్ళొస్తున్నాయిరా... అప్పుడే మూడు పళ్ళు వచ్చాయి నీకు. నన్ను కొరకడం కూడా మొదలు పెట్టావు.











పడక సీను

అయ్యగారు ఈమధ్య మారాం చేయడం మేం పట్టించుకోకపోతే ఉయ్యాలలోంచి దూకేయడం. ఏలా పడతాయో తెలుసా చాలా నెమ్మదిగా దిగుతావు చాలాసార్లు, లేదా ఆదమరుపుగా ఉన్నపుడు గోడమీద బల్లి పడుతుందే అలా ఓక్కసారి దూకేస్తావు నేల మీదకు. ఇదో ఆటనీకు. ఆటంటే గుర్తొచ్చింది. నీకు ఓ బొమ్మలపెట్టి ఉందిరా దానిలో చిన్నచిన్న మూతలు, బంతులు వేసి పెడుతుంటే దానిదగ్గరకు పాక్కుంటూ పోయి దాన్ని లాగేసి మరీ ఆడుకుంటు్న్నావురా బంగారు కొండలాగా......

పడుకున్నప్పుడు పిచ్చి ఫోజులన్నీ పెడతావు నిన్ను మీనాన్న ఫొటోలు తీసి ఆనందపడిపోతాడు కావాలంటే చూడు.















జయ బాబయితో......

ఇక జయ బాబాయితో ఎంతగా ఆడతావురా తనని ఎత్తుకోమని పేచీపెడతావు. పాపం కాసేపైనా కూర్చోనీయవు. బాబాయి కూడా నీతో భలే ఆడతాడు. నీ చిట్టి నేస్తం అయిపోతాడు. నిన్ను చూడడానికి ఏదోలా సమయం చూసుకువస్తాడు. తనని నువ్వు గుర్తు పట్టావని తెగ మురిసిపోతాడు.





చిన్నినాన్నతో కొన్ని జ్ఞాపకాలు.......(దొంగోడి అన్నప్రాసన)

బుజ్జోడా నిగురించి రాయాల్సింది బండెడు ఉండిపోయిందిరా...... ఈరోజు ఏలా అయినా పూర్తిచేసేయాలని పట్టుదలతో కూర్చున్నాను. ఆ మొన్న ఎక్కడివరకు వచ్చాను, నీ మొదటి సినిమా అయ్యాకా నీకు తొమ్మిది నెలలకు అనుకున్న అన్నప్రాసన ఎనిమిదినెలలకే చేసేయాలనుకున్నాం. లేదంటే మేము తింటున్నప్పుడు నువ్వు పెట్టమని చూసే చూపులు భరించడం మావల్లకావడంలేదురా......

నాయనమ్మ ఇప్పుడు కాదు ఏదోలా ఈనెలా ఆపుదాం మా పిల్లలకు నేను తొమ్మిదోనెలలోనే అన్నం పెట్టను అన్నారని ఆగితే నీ ప్రతాపం మామీద చూపెడుతున్నావు. ఇక ఇలా కాదని నాన్న నాయనమ్మను ఈసారొచ్చినపుడు అన్నప్రాసన చేయడానికి ఒప్పించాడు.

రాఖీ పండుగరోజు నీకు అన్నప్రాసన చేసేసాం. పుస్తకం, పెన్ను,చాకు, బంగారం ,పువ్వులు, డబ్బులూ, పరవాన్నాం పెడితే నువ్వు పాకలేక దగ్గరలో ఉన్నాయికదాని కత్తిపట్టుకున్నావు, తర్వాత బంగారంము పట్టుకున్నావు. ఇక అప్పటికే నాకు నీరసం వచ్చేసింది. ఏంటిరా భగవంతుడా వీడు వాళ్ళనాన్నలా రచయిత కాకున్నా, మంచిగా చదువుతాడనుకున్నాను ఏంటి కత్తిపట్టుకున్నాడు. అని.









Sunday, 3 August 2014

ఇవాళ కూర్చున్నావ్!

బన్నానా, ఇవాళే (ఆగస్టు 4, 2014) నువ్వు మొదటిసారి కూర్చున్నావ్. అమ్మ నేర్పించింది నీకు. ఈ మధ్య ఒక రోజు జరిగింది అమ్మ పదే పదే గుర్తు తెచ్చుకుంటుంది. రాత్రి నీకు అటూ ఇటూ అమ్మా నేనూ పడుకున్నాం. నువ్వు మా మధ్యలో నిద్రపోయావ్ అనుకున్నాం. మామూలుగా ఆ టైంలో నువ్వు నిద్రపోవు. రాత్రి మూడింటి దాకా మా దుంప తెంచాకే పడుకుంటున్నావ్. ఇదేంటి వీడివాళ తొందరగా పడుకున్నాడు, అని నీ మీదుగా మేం అటూ ఇటూ చర్చ మొదలుపెట్టామో లేదూ, నువ్వు అప్పటిదాకా మా తో దొంగాట ఆడినట్టు దిగ్గున లేచి తలెత్తి చూశావు.

ఈ మధ్య అమ్మా నేనూ బండి మీద బయటికి వెళ్లినపుడు నిన్ను మా మధ్యన కూర్చూబెడుతున్నాం. నీకు భయమో ఏమో కానీ నా చొక్కాని చాలా గట్టిగా పట్టుకుంటావు.

సరే, ఇవిగో నీ మొదటి కూర్చున్న ఫొటోలు:











Wednesday, 30 July 2014

కాస్త ఆలస్యంగా.....అమ్మ

బండోడా నీగురించి రాసిమురిసిపోవాలని ఈ బ్లాగు పెట్టాం, కానీ నిన్ను చూసుకుంటూ మురిసిపోతున్నామే తప్ప నీ కబుర్లు ఇందులో రాయలే పోతున్నాం. చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయాలి. కాస్త ఆలస్యమైనా మొదలెట్టాను కాసిని కబుర్లు చెప్పాలని.....

నీకు అప్పుడే ఎనిమిది నెలలు వచ్చేసాయి. బాగా ఆడుతున్నావు. నిన్ను వదిలి వెళుతుంటే ఏడుస్తున్నావు. అప్పుడప్పుడూ మంచాలమీదనుండీ, ఉయ్యాలనుండీ బంగీ జంపులు చేస్తున్నావు.

నీకు ఆరోనెల్లో అన్నం పెడదామంటే నాన్నమ్మ తొమ్మిదికి వాయిదా వేసింది. మేము ఏం తిన్నా ఆశగా మావైపే చూస్తావు. ఆఖరుకు మంచినీళ్ళు కూడా తాగనీయవు. మొన్న ఏం చేసావో తెలుసా నీకు గుర్తుండదులే అందుకే చెపుతున్నా మావిడిపండుమీద నీ ఆకలంతా చూపించావు అది తినడం చూసిన వాళ్ళు ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ఎంత గడుగ్గాయి పనిచేసావంటే మాటల్లో చెప్పలేనురా.... నీ ఆకలి విషయం తెలియని నాన్నమ్మ తొమ్మిదో నెలవరకూ ఆగమంటుంది. నువ్వు ఆగే రకానివి కావని ఆవిడకన్నా నిన్ను కన్న మాకు బాగా తెలుసురా.....

నీకు ఈ మధ్య మేమంటే బాగా అలుసుగా ఉందిరా ముఖ్యంగా మీ నాన్నంటే మరీనూ...పాపం ఎంతో ఆశగా నిన్ను ఎత్తుకు ఆడిస్తుంటే నీ రంపం గోళ్ళతో రక్కేస్తావు. గుండెల మీద జుట్టు నెప్పెట్టేలా పీకేస్తావు. పాపం కదారా....

అక్కడితోనే నీ అల్లరి ఆగిందనుకుంటే పొరపాటే మొన్నకు మొన్న ఏం చేసావో తెలుసా.... నాతో మాట్లాడాలని వచ్చిన నా స్నేహితురాలు నిన్ను ఎత్తుకుంటే ఆవిడను గుర్రమనుకున్నావో  ఏమో తెగ కుదిపేసావు పాపం ఆవిడకు ఒంట్లో బాగాలేదు అది నీకేం తెలుసు తెగ సవారీ చేసేసావు. భయపడి నాకిచ్చేసింది. అలా ఉన్నాయి నీ ఆటలు.

నేల మీద పడుకో పెడితే సరిగా ఉంటావా అంటే అదీ లేదు. పాకడం మాట అటుంచి గోడల పగుళ్ళు వెతికి కాళీలో చేతులు పెట్టి కెలుకుతావు నీకు ఏం సరదానో మరి. ఈ వయసులోనే ఇంత అల్లరి చేస్తున్నాడు కదా పెద్దయ్యాకా మీ పరిస్థితి ఏంటీ అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు....:) :)  :)

ఇక ఫిర్యాదుల పర్వం ముగిస్తే........

చాలా బాగుంటుందిరా నీ నవ్వు ఈ నవ్వుతోనే అమ్మాయిలందర్నీ పడేస్తావేమో భవిష్యత్తులో :). మీనాన్నకు నీ నవ్వంటే చాలా ఇష్టం. అంతేకాదు నీకు గుర్తుంటాయోలేదో తెలీదుకానీ మీనాన్న నీకు ఎన్ని పిచ్చి పేర్లు పెట్టి పిలిస్తాడో తెలుసా..... అసలు నాకే గుర్తుండవు. నీతో చాలా బాగా ఆడతాడు మీనాన్న.

నీకు ఉయ్యాల కట్టాను. అలవాటు లేనికారణంగా అనుకుంటాను అందులోనుండీ దొంగ చూపులు చూస్తావు. అంతేకాదు. ఒకటో, రెండోసార్లు పడ్డావు కూడా, అయినా పెద్దగా ఏడవ్వు. అందరూ ముందుకు పాకు తుంటే మా చిట్టిరాజావు నువ్వు మాత్రం వెనక్కు పాకుతున్నావు. ఈ మధ్య మనందరం బుద్దుడిని చూడ్డానికి వెళ్ళాం, నువ్వు చూస్తావా లేదా అనుకున్నాం మీ నాన్నా నేనూ, కానీ వారగా కళ్ళెత్తి చూసి ఆలానే చూపునిలిపేసావు. నీకూ బుద్దుడు నచ్చాడన్నమాట అనుకున్నాం.

ఇంకో పెద్ద విషయం ఏంటంటే పగలంతా హాయిగా నిద్ర పోయి రాత్రికి మా దుంప తెంచుతున్నావురా... నీ అలవాటు ఎంత మార్చాలనుకున్నా మా వల్లకావడం లేదు. నీతో అర్థరాత్రి ఆటలాడుతూ కూర్చుంటున్నాం. ఇద్దరిలో ఎవరికి నిద్ర ఆగడం లేదు. కానీ ఇవేమీ పట్టని నువ్వు చాలా హుషారుగా ఉంటావురా ఆ టైంలో.

నీ ప్రతి చర్యా మాకు అమృతంలా తోస్తుంది. నీకు బోలెడు ఫొటోలు తీసాడురా మీ జయబాబాయి. నాన్నమ్మ ప్రతినెలా తీర్థయాత్రలు చెస్తున్నట్టు నీ దర్శనం చేసుకు వెళుతుంది. :) వచ్చిన ప్రతీసారి మీ నాన్నమ్మకు పెద్ద బిల్లు చేసి పంపుతున్నావు. నీ ఆటలు చూడాలని ఆవిడ వస్తే ఎత్తుకు తిప్పమని తెగ గారం చేస్తావు. పాపం వస్తున్న నిద్రను ఆపుకుని మరీ నీతో ఆటలాడుతుంది నాన్నమ్మ.

ఉగ్గూ, ఉంగాలు తగ్గించి నీలో నువ్వే చిన్నగా కూనిరాగాలు తీస్తున్నావ్. ఇప్పుడిప్పుడే అమ్మా అని చిన్నగా పిలుస్తున్నావనిపిస్తుంది నాకు. నా జుట్టు పట్టుకుని ఏడిచే వరకూ వదలటం లేదురా నువ్వు. మళ్ళీ మీనాన్న వచ్చి విడిపించాల్సిందే. అంత ఉడుం పట్టురా నీది. తెగ గారాలు నేర్చావు.

ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ నా ఒళ్ళో ఉన్న నువ్వు రాయనిస్తేనా.....మళ్ళీ కలుస్తా.





Sunday, 29 June 2014

నా శివరాఘవ కబుర్లు.

చిట్టి నాన్నా నీ గురించి చెప్పాలని అనుకుంటున్నానే కానీ సమయం దొరకడంలేదు. పెద్ద బిజీ అయిపోయిందీ లేదు. నా బిజీ అంతా నువ్వే. రోజులో నీ గురించి ఆలోచించేదే ఎక్కువ. నీ అల్లరి నీ కబుర్లే ఎక్కువ నాకు.

Tuesday, 29 April 2014

నీ ఫస్టు సినిమా

బండోడూ, రాయటం అస్సలు కుదరటం లేదు, అబ్బే ఖాళీయే లేదబ్బా అనలేను గానీ, ఎందుకో ఇటువైపు రాలేదంతే. కానీ ఈ రెండు నెలల్లో ఎన్నెన్ని జరిగిపోయాయని! నువ్వు బండోడూ అన్న నా పిలుపుకు సార్థకత తెస్తూ బుజ్జిముండలాగా కండలగండడులాగా తయారయ్యావ్. ఫేస్‌బుక్లో నీ ఫోటో పెడితే చాలు లైకుల వర్షం. సరే... ఇంతకీ నువ్వు చూసిన మొదటి సినిమా ఏంటో తెలుసా? భవిష్యత్తులో దీని గురించి నువ్వు గొప్పగా ఫీలవ్వకపోవచ్చు, అసలు భవిష్యత్తులో ఈ సినిమా పేరు చెపితేనే ఎవడూ గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఏదేమైనా అది నువ్వు చూసిన మొదటి సినిమా. ఏం చేస్తావ్ పాపం. దాని పేరు "రేసుగుర్రం" అని ఉందిలే. హీరో అల్లుఅర్జున్. హైదరాబాద్, కెపిహెచ్‌బి, జెన్‌టియూ దగ్గర ఉన్న "భ్రమరాంభ మల్లిఖార్జున" జంట థియేటర్లలో మల్లిఖార్జున థియేటర్లో ఆడుతోంది. నువ్వు పొట్టలో పడింది మొదలు అమ్మా నేనూ సినిమాలకి వెళ్లటం మానేశాం. అంతకుముందు కొత్తగూడెంలో "ఇద్దరమ్మాయిలతో" సినిమాకి వెళ్లిందే ఆఖరు. మళ్లీ దాదాపు ఏడాది తర్వాత నిన్ను తీసుకుని వెళ్లాం. ముందు అనుకున్నది కాదు. అప్పటికప్పుడు అనుకుని బయల్దేరి పోయాం. తీరా వెళ్తే టికెట్లు అయిపోయాయి. అక్కడి దాకా వచ్చి ఇంక వెనక్కేం వెళ్తాం. అమ్మ "బ్లాకులో తీసేయ్" అని అనుజ్ఞ ఇచ్చింది. నీకోసమని ఆ టికెట్ దాచి ఉంచింది కూడా. ఇదిగో:


సినిమాకి భయపడుతూనే వెళ్లాం, ఎంత గోల పెడతావోనని. కానీ అస్సలు గోల పెట్టకుండా ఎంత బుద్ధిగా చూశావో తెలుసా. మేమిద్దరం సినిమా చూస్తుంటే, కాసేపు నా ఒళ్లోనూ కాసేపు అమ్మ ఒళ్లోనూ పడుకున్న నువ్వు మాత్రం, సినిమా హాలు పై కప్పు మీద ఆడుతున్న సినిమా తెర తాలూకు వెలుగు నీడల్ని చూస్తూ గడిపావు. అప్పుడప్పుడూ సినిమా కూడా చూశావు. అదీ నీ ఫస్టు సిన్మా అనుభవం. 

Tuesday, 8 April 2014

ఈ రాముడికి సీతెక్కడుంది.

అందరికీ శ్రీ రామనవమి శుభాకాక్షలు......... 


ఇదేమిటి  ఉగాదికి చెప్పని శుభాకాంక్షలు ఇప్పుడు చెపుతున్నాడు అనుకుంటున్నారా అవును మరి రాముడంటే 

అమ్మకున్న ఇష్టం అంతాకలిపి నా పేరుగా పెట్టిందిగా తప్పదు. ఈ రోజు అమ్మ ఉదయాన్నే సీతారాముల కళ్యాణం 

చూసి వచ్చింది. ఆ రాములోరి అందానికి ఎంతగా అమ్మ ఆకర్షితురాలైందంటే ఇంటికి రాగానే  ఈ రామచంద్రుడిని 

పెళ్ళి కొడుకుగా చేసుకుని తెగమురిసిపోయింది.



                           ఇంతకీ నన్ను చూసి మురిసిపోతుందిగానీ సీత ఎక్కడుందో ఇంకా చెప్పదే :)






ఇంకా ఎంతకాలం ఈ బ్రహ్మచారి రాముడినో నా సీత ఎక్కడుందో అసలు ఇంకా పుట్టిందో లేదో :)

Phaneendra - the moviemaker & Sreemaan - the troublemaker/ Neanderthal.

Nowadays I am feeling like a big Pro in art. I am not lying- Out of 1-10 I am at level 6.  *** I have been playing this video game called Sp...