బండోడూ, రాయటం అస్సలు కుదరటం లేదు, అబ్బే ఖాళీయే లేదబ్బా అనలేను గానీ, ఎందుకో ఇటువైపు రాలేదంతే. కానీ ఈ రెండు నెలల్లో ఎన్నెన్ని జరిగిపోయాయని! నువ్వు బండోడూ అన్న నా పిలుపుకు సార్థకత తెస్తూ బుజ్జిముండలాగా కండలగండడులాగా తయారయ్యావ్. ఫేస్‌బుక్లో నీ ఫోటో పెడితే చాలు లైకుల వర్షం. సరే... ఇంతకీ నువ్వు చూసిన మొదటి సినిమా ఏంటో తెలుసా? భవిష్యత్తులో దీని గురించి నువ్వు గొప్పగా ఫీలవ్వకపోవచ్చు, అసలు భవిష్యత్తులో ఈ సినిమా పేరు చెపితేనే ఎవడూ గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఏదేమైనా అది నువ్వు చూసిన మొదటి సినిమా. ఏం చేస్తావ్ పాపం. దాని పేరు "రేసుగుర్రం" అని ఉందిలే. హీరో అల్లుఅర్జున్. హైదరాబాద్, కెపిహెచ్‌బి, జెన్‌టియూ దగ్గర ఉన్న "భ్రమరాంభ మల్లిఖార్జున" జంట థియేటర్లలో మల్లిఖార్జున థియేటర్లో ఆడుతోంది. నువ్వు పొట్టలో పడింది మొదలు అమ్మా నేనూ సినిమాలకి వెళ్లటం మానేశాం. అంతకుముందు కొత్తగూడెంలో "ఇద్దరమ్మాయిలతో" సినిమాకి వెళ్లిందే ఆఖరు. మళ్లీ దాదాపు ఏడాది తర్వాత నిన్ను తీసుకుని వెళ్లాం. ముందు అనుకున్నది కాదు. అప్పటికప్పుడు అనుకుని బయల్దేరి పోయాం. తీరా వెళ్తే టికెట్లు అయిపోయాయి. అక్కడి దాకా వచ్చి ఇంక వెనక్కేం వెళ్తాం. అమ్మ "బ్లాకులో తీసేయ్" అని అనుజ్ఞ ఇచ్చింది. నీకోసమని ఆ టికెట్ దాచి ఉంచింది కూడా. ఇదిగో:
సినిమాకి భయపడుతూనే వెళ్లాం, ఎంత గోల పెడతావోనని. కానీ అస్సలు గోల పెట్టకుండా ఎంత బుద్ధిగా చూశావో తెలుసా. మేమిద్దరం సినిమా చూస్తుంటే, కాసేపు నా ఒళ్లోనూ కాసేపు అమ్మ ఒళ్లోనూ పడుకున్న నువ్వు మాత్రం, సినిమా హాలు పై కప్పు మీద ఆడుతున్న సినిమా తెర తాలూకు వెలుగు నీడల్ని చూస్తూ గడిపావు. అప్పుడప్పుడూ సినిమా కూడా చూశావు. అదీ నీ ఫస్టు సిన్మా అనుభవం.

No comments:
Post a Comment