Wednesday, 30 July 2014

కాస్త ఆలస్యంగా.....అమ్మ

బండోడా నీగురించి రాసిమురిసిపోవాలని ఈ బ్లాగు పెట్టాం, కానీ నిన్ను చూసుకుంటూ మురిసిపోతున్నామే తప్ప నీ కబుర్లు ఇందులో రాయలే పోతున్నాం. చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయాలి. కాస్త ఆలస్యమైనా మొదలెట్టాను కాసిని కబుర్లు చెప్పాలని.....

నీకు అప్పుడే ఎనిమిది నెలలు వచ్చేసాయి. బాగా ఆడుతున్నావు. నిన్ను వదిలి వెళుతుంటే ఏడుస్తున్నావు. అప్పుడప్పుడూ మంచాలమీదనుండీ, ఉయ్యాలనుండీ బంగీ జంపులు చేస్తున్నావు.

నీకు ఆరోనెల్లో అన్నం పెడదామంటే నాన్నమ్మ తొమ్మిదికి వాయిదా వేసింది. మేము ఏం తిన్నా ఆశగా మావైపే చూస్తావు. ఆఖరుకు మంచినీళ్ళు కూడా తాగనీయవు. మొన్న ఏం చేసావో తెలుసా నీకు గుర్తుండదులే అందుకే చెపుతున్నా మావిడిపండుమీద నీ ఆకలంతా చూపించావు అది తినడం చూసిన వాళ్ళు ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ఎంత గడుగ్గాయి పనిచేసావంటే మాటల్లో చెప్పలేనురా.... నీ ఆకలి విషయం తెలియని నాన్నమ్మ తొమ్మిదో నెలవరకూ ఆగమంటుంది. నువ్వు ఆగే రకానివి కావని ఆవిడకన్నా నిన్ను కన్న మాకు బాగా తెలుసురా.....

నీకు ఈ మధ్య మేమంటే బాగా అలుసుగా ఉందిరా ముఖ్యంగా మీ నాన్నంటే మరీనూ...పాపం ఎంతో ఆశగా నిన్ను ఎత్తుకు ఆడిస్తుంటే నీ రంపం గోళ్ళతో రక్కేస్తావు. గుండెల మీద జుట్టు నెప్పెట్టేలా పీకేస్తావు. పాపం కదారా....

అక్కడితోనే నీ అల్లరి ఆగిందనుకుంటే పొరపాటే మొన్నకు మొన్న ఏం చేసావో తెలుసా.... నాతో మాట్లాడాలని వచ్చిన నా స్నేహితురాలు నిన్ను ఎత్తుకుంటే ఆవిడను గుర్రమనుకున్నావో  ఏమో తెగ కుదిపేసావు పాపం ఆవిడకు ఒంట్లో బాగాలేదు అది నీకేం తెలుసు తెగ సవారీ చేసేసావు. భయపడి నాకిచ్చేసింది. అలా ఉన్నాయి నీ ఆటలు.

నేల మీద పడుకో పెడితే సరిగా ఉంటావా అంటే అదీ లేదు. పాకడం మాట అటుంచి గోడల పగుళ్ళు వెతికి కాళీలో చేతులు పెట్టి కెలుకుతావు నీకు ఏం సరదానో మరి. ఈ వయసులోనే ఇంత అల్లరి చేస్తున్నాడు కదా పెద్దయ్యాకా మీ పరిస్థితి ఏంటీ అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు....:) :)  :)

ఇక ఫిర్యాదుల పర్వం ముగిస్తే........

చాలా బాగుంటుందిరా నీ నవ్వు ఈ నవ్వుతోనే అమ్మాయిలందర్నీ పడేస్తావేమో భవిష్యత్తులో :). మీనాన్నకు నీ నవ్వంటే చాలా ఇష్టం. అంతేకాదు నీకు గుర్తుంటాయోలేదో తెలీదుకానీ మీనాన్న నీకు ఎన్ని పిచ్చి పేర్లు పెట్టి పిలిస్తాడో తెలుసా..... అసలు నాకే గుర్తుండవు. నీతో చాలా బాగా ఆడతాడు మీనాన్న.

నీకు ఉయ్యాల కట్టాను. అలవాటు లేనికారణంగా అనుకుంటాను అందులోనుండీ దొంగ చూపులు చూస్తావు. అంతేకాదు. ఒకటో, రెండోసార్లు పడ్డావు కూడా, అయినా పెద్దగా ఏడవ్వు. అందరూ ముందుకు పాకు తుంటే మా చిట్టిరాజావు నువ్వు మాత్రం వెనక్కు పాకుతున్నావు. ఈ మధ్య మనందరం బుద్దుడిని చూడ్డానికి వెళ్ళాం, నువ్వు చూస్తావా లేదా అనుకున్నాం మీ నాన్నా నేనూ, కానీ వారగా కళ్ళెత్తి చూసి ఆలానే చూపునిలిపేసావు. నీకూ బుద్దుడు నచ్చాడన్నమాట అనుకున్నాం.

ఇంకో పెద్ద విషయం ఏంటంటే పగలంతా హాయిగా నిద్ర పోయి రాత్రికి మా దుంప తెంచుతున్నావురా... నీ అలవాటు ఎంత మార్చాలనుకున్నా మా వల్లకావడం లేదు. నీతో అర్థరాత్రి ఆటలాడుతూ కూర్చుంటున్నాం. ఇద్దరిలో ఎవరికి నిద్ర ఆగడం లేదు. కానీ ఇవేమీ పట్టని నువ్వు చాలా హుషారుగా ఉంటావురా ఆ టైంలో.

నీ ప్రతి చర్యా మాకు అమృతంలా తోస్తుంది. నీకు బోలెడు ఫొటోలు తీసాడురా మీ జయబాబాయి. నాన్నమ్మ ప్రతినెలా తీర్థయాత్రలు చెస్తున్నట్టు నీ దర్శనం చేసుకు వెళుతుంది. :) వచ్చిన ప్రతీసారి మీ నాన్నమ్మకు పెద్ద బిల్లు చేసి పంపుతున్నావు. నీ ఆటలు చూడాలని ఆవిడ వస్తే ఎత్తుకు తిప్పమని తెగ గారం చేస్తావు. పాపం వస్తున్న నిద్రను ఆపుకుని మరీ నీతో ఆటలాడుతుంది నాన్నమ్మ.

ఉగ్గూ, ఉంగాలు తగ్గించి నీలో నువ్వే చిన్నగా కూనిరాగాలు తీస్తున్నావ్. ఇప్పుడిప్పుడే అమ్మా అని చిన్నగా పిలుస్తున్నావనిపిస్తుంది నాకు. నా జుట్టు పట్టుకుని ఏడిచే వరకూ వదలటం లేదురా నువ్వు. మళ్ళీ మీనాన్న వచ్చి విడిపించాల్సిందే. అంత ఉడుం పట్టురా నీది. తెగ గారాలు నేర్చావు.

ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ నా ఒళ్ళో ఉన్న నువ్వు రాయనిస్తేనా.....మళ్ళీ కలుస్తా.





No comments:

Post a Comment

Phaneendra - the moviemaker & Sreemaan - the troublemaker/ Neanderthal.

Nowadays I am feeling like a big Pro in art. I am not lying- Out of 1-10 I am at level 6.  *** I have been playing this video game called Sp...