నేను Seinfeld రెండోసారి చూద్దామని మొదలుపెట్టి మూడో సీజను దాకా వచ్చేసరికి చిన్నోడికి ఒంటిపూట బళ్లు మొదలయ్యాయి. ఇంక వాడూ నాతో చూట్టం మొదలుపెట్టాడు. అలా ఈ వేసవి సెలవుల్లో రోజుకి రెండు మూడు ఎపిసోడ్లు చొప్పున మిగతా ఏడు సీజన్లూ ఇద్దరం కలిసి చూసేశాం. పెద్దాళ్ల షో అయినా, అందులోని సిల్లీనెస్ ని వాడూ చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి నాకూ కూడా Kramer కేరెక్టరు అంటేనే ఇష్టం. ఒకటి రెండు ఎపిసోడ్లు వాడి వయసుకి నప్పవనిపించినవి స్కిప్ చేశాను. ఇంకా ఎండలు ముదరని కొన్నాళ్లు మటుకు కొన్ని రోజులు పొద్దుటిపూట్ల ఊరకే వీధుల్లో తిరిగాం. ఎండలు ముదిరి ఇంట్లోకే confine అయ్యాకా ఇక అక్కడ కాలక్షేపానికి వేరేవి వెతుక్కోవాల్సి వచ్చింది. నేను చూద్దామనుకునే సినిమాలూ, చదవాలనుకునే పుస్తకాలూ పూర్తిగా పక్కన పెట్టేశాను. ఇద్దరం చూడగలిగేవీ చదవగలిగేవీ... వాటి జోలికే వెళ్దాం అని నిశ్చయించుకున్నాను. Seinfeld ఒక్క విషయంలో మాత్రమే నా స్థాయికి వాడ్ని లాక్కొచ్చాను. ఇక మిగతావన్నీ వాడి లెవెల్‍కి నేను వెళ్ళాల్సి వచ్చినవే. ఈ వేసవి సెలవుల్లో వాడికి Anime shows, Manga books పరిచయం చేద్దాం అనుకున్నాను. మామూలుగా నెట్‌ఫ్లిక్స్ ఎకౌంట్ వాడికోసమే మెయిన్‌టైన్ చేస్తుంటాను. కానీ అందులో అమెరికన్ షోస్ అన్నీ ఒకే పాటర్న్‌లో, మరీ పొలిటికల్లీ కరెక్టడ్‌గా, అన్నింటినీ తేలిగ్గా తీసిపారేసే టిపికల్ అమెరికన్ హ్యూమరుతో వెళ్తున్నాయనిపించింది. అందుకే Anime, Manga వాడికి పరిచయం చేద్దామనిపించింది. ఎప్పుడో 80'sలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న Dragon Ball సిరీసులు మొత్తం డౌన్లోడ్ చేసి చూపించాను. నేను కలిసి అన్ని ఎపిసోడులూ చూడలేదు గానీ, నేను మిస్సయిన ఎపిసోడ్లలో కథ ఏమవుతుందో నెట్‌లో చదివి నన్నునేను అప్డేట్ చేసుకున్నాను. ఎందుకంటే, వాడితో మాట్లాడటానికి కామన్ టాపిక్స్ కోసం. ఆ విధంగా Goku అనే ఆధునిక పురుషోత్తముడు ఇద్దరికీ హాట్ టాపిక్ అయ్యాడు. గత ఏడాది నేను సాధించిన గొప్ప విజయాల్లో చిన్నోడికి ఇంగ్లీషు చదవటాన్ని వాళ్లు టీచర్లు నేర్పించలేనిది నేనే ఒంటిచేత్తో నేర్పగలగటం ఒకటి. Diary of a Wimpy Kid మొదటి రెండు వాల్యూములు నేను చదివి వినిపించినా, మూడో వాల్యూము నుంచి ఏడో వాల్యూము దాకా వాడే చదువుకున్నాడు. ఆ ఇన్‍స్పిరేషన్‌తో డైరీ కూడా రాయటం మొదలుపెట్టాడు. దానికి కొనసాగింపుగా ఈ వేసవి సెలవుల్లో One Piece మంగా బుక్స్ కొన్నాను. మూడు వాల్యూములు ఇలా అమెజాన్ నుంచి పుస్తకం రాగానే అలా గంటలో చదివేశాడు. తర్వాతి పుస్తకం కొనటం లేటయితే, ఉన్నదాన్నే మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. గత వేసవి సెలవుల్లో ఇంగ్లీషు చదవటం నేర్పినట్టే ఈ సెలవుల్లో తెలుగు నేర్పుదాం అని కొన్ని క్లాసులు తీసుకున్నాను కానీ, కంటిన్యువస్‌గా చెప్పటం కానీ నా వల్ల కాలేదు. కలిసి చూసిన సినిమాలు: Ratatoullie, Minnal Murali, The Emperor's New Groove. మిన్నల్ మురళి వాడికి బాగా నచ్చింది. అప్పుడప్పుడూ కలిసి బొమ్మలు కూడా వేశాం. వాడి బొమ్మలు చాలా మెరుగయ్యాయి. అలాగే ఈ నెలతో Chess.com అకౌంటుకి డబ్బులు కట్టాను. ఇద్దరం కలిసి ఆడటం, లేదా ఆ అకౌంటులోకి వెళ్లి అపరిచితులతోనో, చెస్ bots తోనో ఆడటం... అదో కాలక్షేపం. నన్ను తొందరలోనే మించిపోయాడు. అంటే పెద్ద పాయింట్లేమీ కాదు. నాలుగొందలు దాటాడు ఇప్పుడే. ఇలా చెస్ ఆడటం, లేదా యూట్యూబులోకి వెళ్లి Magnus Carlsen, Hikaru, Gotham chess... వీళ్లవో, వీళ్ల గురించినవో చెస్ వీడియోలు చూడటం... అదో పెద్ద కాలక్షేపం. ఇంకోటి, వాడిలొ హ్యూమరు, నన్ను నవ్వించగలగటం నేను కొత్తగా గమనిస్తున్న విషయాలు. అలా మొత్తానికి ఈ వేసవి సెలవులు పొద్దస్తమానం బాగా కలిసి గడిపి ఇవాళ మొదటి రోజు స్కూల్లో దింపాను. నా నైట్ డ్యూటీస్ వల్ల మళ్లీ ఏడాదికి గానీ ఇలా దొరకడు.
Sunday, 11 June 2023
Sunday, 21 May 2023
అమ్మ చిరునామా నువ్వు..
చిన్న మొలకని జాగ్రత్తగా చూసుకోమని నానీ హెచ్చరించిన ప్రతిసారీ నాకు లోపల ఏం అనిపిస్తుందో తెలుసా.. నీవు నాకు గొప్ప కొడుకులా కన్నా నన్ను అమ్మతనానికి దగ్గర చేసి, చాలా బెంగలనుంచి బయటపడేసిన చిట్టి కృష్ణుడికి నేను ప్రత్యేకించి చేసేదేం ఉంటుంది అని అనిపిస్తుంది. భగవంతుడు నా నుంచి చాలా లాగేసుకుని నిన్ను వాటిని భర్తీ చేసేందుకు ఇచ్చాడేమో అనిపిస్తుంది. నీ ప్రతి కదలికా అందంగా అనిపిస్తుంది. నీ అల్లరి, నీ మౌనం నాకు చుట్టూ చేరి ఆనందంలో తేలిపోయేలా చేస్తాయి.
ఎన్నో దిగుళ్ళకు నీ చిరునవ్వు సమాధానం. నాలో చాలా దిగులుందని మరిచిపోయేది నిన్ను చూసుకునే.. నువ్వు ఎదిగి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిగలిగేంత వరకూ నీకు చేయూతనిచ్చే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని ఆశిస్తున్నాను. చాలారోజులు నీ ఆరోగ్యం గురించి దిగులుండేది. దానినీ దాటావేయో.. నువ్వు చదువులో చురుకు కాదని అనుకున్నంత సేపు లేదు.. నీలోకం అంతా చదువే ఉందిప్పుడు. అమ్మగా లోపల చాలా గర్వపడుతున్నా దానిని పైకి తెలీనీయను. నిన్ను కసురుకున్నప్పుడు నీకు కోపం వచ్చి ఈ అమ్మను వద్దంటావు చూడు. బాధేస్తుంది. అంత కఠినమైన మాటలు నీ నోటితో అన్నప్పుడు.. నిన్నుచూసి పొంగిపోయిన ప్రతిసారీ లోపల మళ్ళీ భయం కమ్ముకుంటుంది. ఇదేంటి ఇలా నిన్ను పొగిడేసాను. ముద్దాడాను. మురిసిపోయానని అలజడి మొదలవుతుంది. దిష్టి తగులుతుందేమోనని మళ్ళీ నిన్ను కోప్పడతాను.
మీ నానీ అంటుంది కదా నువ్వు పెద్దవాడవై, ఎదిగి గొప్ప ఆఫీసర్ వి కావాలని.. ఆమె కోరిక. నాకు అంతకన్నా గొప్ప కోరిక ఉంది. నా బాకీలన్నీ నువ్వే తీర్చాలి. నేను సమాధానం చెప్పాలనుకునే వాటికి నా అవమానాలకి అన్నింటికీ నువ్వు జవాబుదారీవని నమ్ముతాను. నిన్ను నిలబెట్టిన రోజున నేను పూర్తి విజయం సాధించినట్టు. నీ ఆలనా పాలనా చాలా శ్రద్ధగా చూసుకోవాలనిపిస్తుంది. ఈమధ్యకాలంలో నిన్ను సరిగా చూసుకోవడంలేదేమోనని లోపల దిగులు కమ్ముకుంటుంది. మళ్ళీ నేనే తమాయించుకుంటాను. నీకు నేను పండన్నా కొనితేగలుగుతున్నానంటే అది ఈమాత్రం కష్టం పడుతున్నందువల్లనే. నన్ను మనిషిగా నిలిపేది ఇదే. లేదంటే నేనూ మరొకరిపై ఆధారపడి బతకాల్సిందే. నీకు పెన్సిల్ కొని ఇవ్వగలిగే అమ్మ ఉందనుకో.. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా నువ్వు నామాట విని డైరీ రాస్తున్నావు చూడు. అది ఇంకా ఆనందం నాకు. నీ డైరీకి రాము అనే పేరు పెట్టడం ఇంకా ముద్దు. అందులో నువ్వు ఏం రాసినా నాకు తెలియకపోయినా మురిపంగా ఉంటుంది.
చదవడం రాదన్నంత సేపు లేకుండా నువ్వు పుస్తకాలు చదివేస్తుంటే నాకు తీన్మార్ ఆడినంత ఆనందంగా ఉంటుంది. కాస్త గర్వం కూడా.. ఇక నీ బొమ్మలో నాకు చాలా ఇష్టం. వాటితో నువ్వు ఏదోరోజు గొప్పవాడిగా గుర్తింపు పొందుతావేమోనని అనిపిస్తుంది. నీ ప్రతి ఆలోచనలో నేను ఉండకపోయినా నీ ప్రతి అడుగులో వెనుక ఉండాలనేది
అమ్మగా నా కోరిక. బావుండు నా చిట్టి తండ్రి. గొప్పగా బ్రతుకు. ఇప్పుడు కూడా ఈమాటలు చెప్పకపోదును. ఉదయం బుజ్జిగా ముడుచుకుని నువ్వు పడుకున్నప్పుడు నా కడుపులో చిన్నగా బాధ మొదలైంది. నిన్ను ఎన్ని ఇబ్బందుల మధ్య ఈ భూమి మీదకు తెచ్చానో కదా అని.. దినదినం నీ ఎదుగుదలను చూడగలిగే అవకాశం, ఆనందం ఆ పరమేశ్వరుడు ఇచ్చినందుకు సంతోషంగా నమస్కరిస్తూ.. అమ్మ..
Tuesday, 28 June 2022
picking you up at school on a rainy day
వర్షం వల్ల స్కూలు గేటు ముందు జనం మరీ ఎక్కువమంది ఉంటారని తెలుసు. కాస్త ఆలస్యంగా వెళ్దామని అనుకున్నాను. కొత్త ఇంటిలోకి వెలుతురు సరిగా రాదు. పగలు కూడా లైట్లేయాలి. బైట బళ్లు పార్కింగ్ చేసే చోట కూడా అంతే. ఇవాళ మబ్బుబట్టి చినుకులు పడుతుంటే ఇంకా మరీ చీకటిగా ఉంది. కాసేపు దోమల్ బాట్ పుచ్చుకుని బైట బళ్ళ దగ్గర దోమల్ని కొట్టాను. పట పటమని మెరుస్తూ బాట్ పేలటం బాగుంటుంది. అది పట్టుకుని కాసేపు మినీ Thor లాగా ఫీలయ్యి, మొత్తానికి పది నిమిషాలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లాను. అయినా సరే స్కూలు గేటు ముందు జనం కిటకిటలాడిపోతున్నారు. చినుకులు ఎక్కడైనా బావుంటాయి కానీ, బట్టతల మీద బాగోవు. హెల్మెట్ తీయకుండానే ఆ పేరెంట్స్ గుంపులోకి దూరి, అక్కడ మైకుపట్టుకుని పిల్లల్ని పిలుస్తున్న టీచరుకి వినపడేలా, అలవాటులేనంత గట్టిగా నీ పేరు అరిచి చెప్పి, మొత్తానికి నిన్ను బైటకి తీసుకువచ్చాను. You looked tired. And happy. అక్కడున్న రద్దీ వల్ల బండి దూరంగా పార్క్ చేశాను. అక్కడిదాకా ఇద్దరం నడిచి వెళ్తుండగా అప్పటికప్పుడు అబద్ధం చెప్దామనిపించింది. ఇవాళ బండి తేలేదని, మనమిద్దరం నడిచే ఇంటికి వెళ్లాలని చెప్పాను. నువ్వు ఘోరంగా రకరకాలుగా నన్ను తిడుతుండగానే, మనం బండి దగ్గరకి వచ్చాం. నేను దాన్ని చూసి ఆశ్చర్యపోయినట్టు బిల్డప్ ఇచ్చి- "అరె ఈ బండి ఎంత మంచిదిరా.. సీక్రెట్ గా నన్ను ఫాలో అయి ఇక్కడిదాకా ఒచ్చేసిందీ" అన్నాను. నువ్వు వెంటనే జోక్ అందిపుచ్చుకొని- "ఎంత బుజ్జిముండ" అని దాన్ని హెడ్ లైట్ దగ్గర పట్టుకుని ముద్దు చేశావు. బండి డిక్కీ తీసి లోపల నీ కేరేజీ పెడుతుంటే అవినాష్ గురించి చెప్పావు. ఈమధ్య వాడు నీకు స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాడని, వాడు కనపడ్డం నీకు నచ్చటం లేదని చెప్పుకొచ్చావు. I didn't see any basic human reasoing in it, but I liked how you put it. మీరిద్దరూ సింక్ దగ్గర ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకున్నారట. టీచర్ ఇద్దర్నీ మోకాళ్ల మీద నిలబెట్టిందట. నువ్వు చెప్తున్నంత సేపూ నేను ఈ అవినాష్ గాడ్ని అశుతోష్ తో కన్ఫ్యూజ్ అయ్యాను. టీచర్ కొట్టకుండానే 'కొట్టొద్దు టీచర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్' అని బాడీ మెలికలు తిప్పేసి మరీ ఓవరేక్షన్ చేసే అశుతోష్. నా జెర్కిన్ నీకు తొడిగి, నా హెల్మెట్ నీకు పెట్టాక, బయల్దేరాం. నువ్వు హెల్మెట్ గ్లాస్ మూసుకున్నావు. అందులోంచి మాట్లాడుతుంటే నీ మాటలు స్పష్టంగా వినపడటం లేదు. "ఆ...ఊ" అంటున్నాను. స్కూలు దగ్గరలో ఏదో బిల్డింగ్ కూలగొడుతున్నారు. నీకు చూపిద్దామని ఆపాను. ఆ క్రేన్ అంచుకి ఒక పెద్ద ఇనుప పిడికిలి ఉన్నట్టు ఉంది. It kept punching up the walls like a WWE wrestler. ఇద్దరం కాసేపు ఆగి చూసి బయల్దేరాం. నువ్వు లాంగ్ రూటులో వెళ్దామన్నావు. ఈ వర్షాన్నీ ఈ వాతావరణాన్నీ హెల్మెట్ గ్లాస్ లోంచి చూట్టం నీకు నచ్చిందనుకుంటా. కానీ ఇక్కడ నా బట్టతల మీద చినుకులు.. చిరాకు దొబ్బుతోంది. రోజూ వెళ్ళే రూటులోనే తీసుకొచ్చాను. నువ్వు వెనక నుంచి చేతులు ముందుకుతెచ్చి వాటిని నా పొట్ట మీద కలిపి రెండు చేతులూ వేళ్ళతో మెలేశావు. ఒక స్పీడ్ బ్రేకర్ మీంచి బండి గెంతినప్పుడు అప్పటికే వర్షానికి తడిసిన నీ చేతులు ఒకదాంట్లోంచి ఒకటి జారిపోయి భయపడ్డావు. ఏం మాట్లాడుకున్నాం? I guess we talked about people, how we hated them today for being all over the place. రోడ్డు మీద అక్కడక్కడా విరిగిన తురాయి కొమ్మలు. పళ్ళ మార్కెట్లో నేరేడుపళ్లు చినుకుల్తో మెరవటం చూశాను. ప్రపంచంలోని పర్పుల్ రంగంతా వాటి నుంచే వచ్చిందనిపింది. మధ్యలో గుర్తొచ్చింది- నువ్వు నిన్న 'Behka Mai Behka' పాటని ఇష్టంగా విన్నావని. I tried to hum. You told me to shut up. So I did. మధ్యలో ఒక వేప చెట్టు బాగా లేత అకులతో ఉంది. ఎంత లేత అంటే అస్సలు ముదురాకులే లేవనిపించేట్టు. బండి స్లో చేసి చూపించాను. You seemed to be as surprised and as happy to see it as i did. More than me infact. మలుపులు తిరిగి ఇంటికొచ్చేశాం. గేటు దగ్గర కూడా బురద బురద. గేటు బైటకి తీయాలో లోపలికి తీయాలో నీకు ఎప్పుడూ కన్ఫ్యూజనే. ఇంట్లోపలికి వెళ్లాకా కూడా నువ్వు ఆ పెద్ద హెల్మెట్టూ, నీకు పాదాల దాకా వచ్చే జెర్కిన్నూ తీయకుండా, బుల్లి ఏలియన్ లాగా కాసేపు గెంతావు. అద్దం ముందు ముడ్డూపుతూ డాన్స్. ఇంట్లో తడి చేస్తున్నావని బలవంతంగా విప్పించాను. తర్వాత స్పార్కోని చేతిలోకి తీసుకుని కాసేపు ఆడించటం మొదలుపెట్టావు. నేను కూడా తల తుడుచుకుని, settled back into the dry cosy land of home.
Tuesday, 31 May 2022
చిన్నోడికి పెద్ద పెద్ద బెంగలు...
అంతా నువ్వు సెకండ్ క్లాసు పూర్తి చేయటంతో మొదలైంది. ఇల్లు మారాం కాబట్టి దగ్గర్లో స్కూల్లో జాయిన్ చేద్దామని వెళ్లాం. ఇక్కడే అవంతి నగర్ తోట దగ్గర్లో ఉన్న స్కూలు. పేరు సంస్కార్ అట. అక్కడ వాళ్లు మూడో తరగతిలో చేర్చుకోవటానికి టెస్ట్ పెట్టారు. నువ్వు టెస్టు రాయలేకపోవటం అటుంచి కనీసం ఇంగ్లీషు పదాలు సులువైనవి కూడా చదవలేకపోయావు. ప్రిన్స్‌పల్ లోపలికి పిలిచింది. గంట సేపు ఆ అప్పాయింట్మెంట్ నడిచింది. అదంతా అయ్యేసరికి, మాకు నీ భవిష్యత్తు మీద పెద్ద బెంగపెట్టుకునేలా మాట్లాడింది ఆ ప్రిన్సిపల్. నువ్వు పన్లో పని నాన్న కంప్యూటర్ చూస్కుంటూ ఉంటాడు, నాతో టైమ్ గడపడని కంప్లయింట్ కూడా ఇచ్చావు. మొత్తానికి ఆ స్కూలువాళ్లు ఎక్కడో ఎసెస్మెంటుకి పంపారు. ఆ వాతావరణం చూడగానే, అది మానసికంగా సరిగా లేని పిల్లల కోసం పెట్టిన ఫెసిలిటీ అని అర్థమైంది. వాళ్లు కూడా టెస్టు పెట్టి నువ్వు చాలా వెనకబడి ఉన్నావని చెప్పారు. ఈ వెధవ స్కూలు వద్దని ఇంటికి ఇంకా దగ్గర్లో ఉన్న విజేత స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్తే అక్కడ కూడా వాళ్లు టెస్ట్ పెడతాం పాస్ అయితేనే తీసుకుంటాం అన్నారు. ఇప్పటికి నీ పరిస్థితి మాకు అర్థమైంది. ఆల్రెడీ ఒక మూడు నెలలుగా నీ పాత స్కూలు (కేసల్ టౌన్) టీచరు జయ మేడమ్ కూడా నీకు ఏం రావటం లేదని, నేర్పటం కష్టంగా ఉందని చెప్పింది. అందుకే టెస్టులో నువ్వెలాగూ పాసవ్వవని తెలిసి విజేత స్కూల్ కూడా వదిలేసుకున్నాం. మళ్లీ పాత స్కూల్లోనే, వాళ్లు ఒకవేళ మూడో తరగతి కష్టమని రెండో తరగతిలోనే వేసినా, చేర్చేద్దామని డిసైడ్ అయ్యాం.
అయితే, నీకు రెగ్యులర్ టీచింగ్ మెథడ్ కష్టంగా ఉందని అర్థమై, నేనే కాస్త ఫోనెటిక్ అవేర్నెస్ మెథడ్ ప్రకారం, అంటే సౌండ్స్‌ని బట్టి పదాలు గుర్తుపట్టే పద్ధతి ప్రకారం, పాఠం చెప్పటం మొదలుపెట్టాను. రోజుకి రెండు గంటలు నేను ఒక క్లాసు, అమ్మ ఒక క్లాసు చెప్తున్నాం. ఇప్పటికి పది రోజులపైనే అయింది. మెల్లగా అందుకుంటున్నావన్న నమ్మకం వచ్చింది.
అయితే నీకు శ్రద్ద ఉండదు. ఏకాగ్రత పెట్టవు. నీ వైపు నుంచి సాయం లేకుండా నేనే అంతా నీ మైండులో కూరిపెట్టాల్సి వచ్చినట్టు పాఠం చెప్పాల్సి వస్తుంది. అయినా ప్రయత్నిస్తున్నాను. ఇంకో రెండు మూడు నెలలైనా పాఠం చెప్పాలని ఉంది. నిన్ను మిగతా పిల్లలతో కలపాలని ఉంది. ఒక్కసారి నీకు చదవటం రాయటం వచ్చేస్తే, నువ్వు చాలామంది పిల్లల కంటే బ్రైట్‌గా ఉంటావని నా నమ్మకం. చూద్దాం.
దీనంతటికీ నీ చిన్ని లైఫులో నువ్వు ఫేస్ చేసిన సమస్యలే కారణమని మాకు తెలుసు. కరోనా ఒక ఏడాదిపైనే స్కూల్లేకూండా చేసింది. లాస్ట్ ఇయరంతా అమ్మ అనారోగ్యం గురించి నీ చిన్ని మెదడులో నువ్వు కూడా టెన్షన్ పడ్డావని తెలుసు. జనవరిలో అయితే కొన్నాళ్లు నానీ దగ్గర నిన్ను వదిలి వచ్చాను. ఇక నీ బక్కపల్చని ఆరోగ్యం, పుట్టినప్పటి నుంచి ఎదుర్కొంటున్న సమస్యలూ అన్నీ నిన్ను వెనక్కి లాగుతున్నాయని తెలుసు. చిన్ని చిన్ని నీ లైఫులో నువ్వూ ఈ నీ స్థాయికి మించిన బెంగలు పడుతున్నావు. స్కూల్లో నీ సిచ్యువేషన్ గురించి నువ్వు పైకి చెప్పకపోయినా ఆలోచిస్తుంటావని అప్పుడప్పుడూ నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి అర్థమవుతుంది. ఏదేమైనా మనం కలిసి ఈ బెంగ దాటేస్తామనే అనుకుంటున్నాను.
బుంగమ్మా.. లవ్యూ....
Saturday, 2 May 2020
ఎదిగిపోతున్నావ్ రోయ్.. మెహెర్ శివ రాఘవా..
తల్లిగా నాకు తండ్రీగా ఫణికి నువ్వు చిన్నాడిలా కనిపించాల్సింది పోయి. పెద్దవాడిలా కనిపించడం మొదలైంది. నీ మాటలు చేష్టలు అన్నీ ముదురు టెంకెకి ఉన్నట్టు ఉన్నాయి. ఎన్ని వగలు పోతాయో.. మీ నాన్న నీకు అన్నీ నూరిపోసి నిన్ను బాల మేధావుల జాబితానుంచి గడుసు పిల్లాడి జాబితాలోకి చేర్చి పారేశాడు.
ఇప్పుడు నీకు ఆరో ఏడు నడుస్తుంది. నీకు నేను నాన్నా అప్పుడప్పుడు నాయనమ్మా దోస్తులుగా మిగిలాం. అన్నట్టు మరిచాను.. మీ లల్లి పిన్ని కూడా నీ గురించి అడుగుతుందిరోయ్.. నువ్వంటే తనకి చాలా ఇష్టం. ముఖ్యంగా నీ ఇంగ్లీషు నువ్వు మాట్లాడే అమెరికన్ ఏసెంట్ అంటే తనకి మరీ ఇష్టం. మన జాబితాలో బంధువులనుకున్నవాళ్ళు ఇప్పుడు మనకి అందుబాటులో లేరు. కాబట్టి వాళ్ళసంగతి వదిలేద్దాం.
పెరిగి పెద్దయ్యాకా నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ మాత్రమే కావాలనే పిచ్చి మాకేం లేదు. నువ్వు ఏదైనా మాకు ఆనందమే... నీకు సాహిత్యం పట్ల అభిలాష ఉండాలి అనే కోరుకుంటాను.. ఎందుకంటే మీ నాన్న ఓ కొత్త లోకాన్ని కనుక్కున్నాడు.. అందులోకి నన్నూ తీసుకుపోయాడు.. నేను అంత లోకాన్నీ అర్ధం చేసుకోలేకపోయినా.. కొంత రాతలా పట్టుకున్నాను. నువ్వూ ఆ లోకంలో విహరించాలని ఓ తల్లిగా కోరుకుంటాను. సాహిత్యం తెలిసినవాడికి దాన్ని మరిగిన వాడి ఆలోచనలు క్రూరంగా పోవని గట్టిగా నమ్ముతాను.
ఎదుటివారితో ప్రేమగా.. జాలికలిగి బ్రతికితే చాలు.. నీకు మంచి భవిష్యత్ ఇవ్వాలని, అంతకన్నా ముందు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటాను. నా బంగారం చల్లగా ఉండాలి.
Tuesday, 8 October 2019
బుల్లమ్మా.. నీకు ఫోటోల పిచ్చి బాగా పెరిగిపోయింది
అవునురా.. ఆమధ్య ఫోటోలు తీసుకోవడం వాటికి ఏవేవో ఫిల్టర్స్ పెట్టి వాటిని చూసుకుని మురిసిపోవడం ఎక్కవైపోయింది నీకు.. మాతో కూడా ఈ ఫోటోల ఫోజులు పెట్టించి నవ్వుకోవడం వాటితో మమ్మల్ని ఉడికించడం ఇదే పనైపోయింది. నువ్వ ఏది చేసినా బావుంటుంది. నీతో ఇలా సమయాన్ని గడపడానికి నేనూ నాన్నా చాలా ఇష్ట పడతాం. నా బంగారు తల్లి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి.
Saturday, 30 March 2019
చిన్నోడా... పెద్దాడివైపోతున్నావ్...
నీ గురించి ఆలోచించిన ప్రతీసారి నా ప్రశ్నకు నేనే బదులు చెప్పుకుని తృప్తి పడిపోతుంటాను. ఎందుకో ఈ మధ్య ఓ పదహారేళ్ళ కుర్రాడితో ఉంటున్నాను అనిపిస్తుంది. ఎంతో ముద్దుగా విసుక్కుంటున్నావ్ నన్ను.
నువ్వు ఎప్పుడూ అన్నం పెడుతూ నా బట్టల మీద పడేస్తావ్ కదా.. నువ్వు అంతే కదా అంటావ్.. అవునా.. నేను పడేస్తానా???
మళ్ళీ ఇదొకటి నాకు యూనీఫామ్ లేదని టీచర్ తిట్టింది. నీ వల్లే.. నన్ను తిట్టింది. నన్ను బేడ్ అంది. అన్నావ్.. పోనీలేరా.. నాలుగురోజుల్లో స్కూలు అయిపోతుంది కదా అంటే ... నీ విసుగు ముఖం తో ఎంత చిరాగ్గా చెప్పావో..
అంతేనా.. నీకు మీనాన్నా నేను దగ్గరగా ఉండటం ప్రేమించుకోవడమని తెలుసు, మా ఇద్దరినీ ఓ గదిలో పెట్టి తలుపులేసి, ఇక మీరు ప్రేమించుకోండే.. నేను ఏబీ చూస్తాను అంటావ్.. అసలు ప్రేమంటే ఏంటిరా.. ముదురు... నాకు నీ వయసుకి ప్రేమ అనే అక్షరాలు కూడా రావు. తెలియవు.
మరి నువ్వో ఐ లవ్ యూ అంటూ సింబల్ వేసిమరీ చేతులమీద రాస్తావు.నేను పొట్టి బట్టలు అదే షాట్, టీషర్ట్ వేసుకుంటే నీ ముఖాన్ని చిరాగ్గా పెట్టి బాలేదమ్మా.. బాలేదు అంటావ్.. నీకెందుకురా మీ నాన్నే ఏం అనడంలేదు కదా అంటే.. నీ నుండీ విసుగే కనిపిస్తుంది. నేను అందంగా తయారైతే బావున్నావమ్మా శాంతి అందంగా ఉన్నావ్ అంటావ్.. మీ నాన్న కళ్ళల్లో నేను ఏ భావానైనా వెతుక్కుని పట్టుకోవాలి. మరీ నువ్వో అన్నీ ఇట్టే చెప్పేస్తావ్. ఎక్కడో ఏదో శూన్యంలోంచి వెతికి తేవాలని చూస్తాయ్ నీ చూపులు అవి ఏం వెతుకుతున్నాయో తెలిదు.
ప్రేమ పాటలు, వైరాగ్యం పాటలు అన్నీ నీకు భలే నచ్చుతాయ్.. నీ ఇష్టాలు, కష్టాలు అన్నీ ముద్దేరా మాకు. మీ నాన్నను భలే ఆడిస్తావ్.. బావుండరా.. ఆరోగ్యంగా.. ఆహ్లాదంగా అంతే చాలు మాకు. మొత్తానికి నాకు మాత్రం
ఏమోరా.. ఒక్కోసారి నాకు పెద్ద పిల్లాడి తోడుందని అనిపించేస్తుందీ మధ్య.
Friday, 15 March 2019
సెంటీ ఫెలో!
"ముసలోడయిపోవద్దు" అన్నావు.
"అలా ఎలారా, అందరూ ముసలోళ్ళైపోతారు కదా" అన్నాను.
"వద్దు అయిపోవద్దు" అని పెంకిగా మొదలుపెట్టావు, ఓ పక్కన కళ్ళల్లోకి నీళ్ళు తిరిగిపోతున్నాయి. నాకు నవ్వొస్తోంది, జాలీ వేస్తోంది. అలాగని అబద్ధం చెప్పాలనీ అనిపించటం లేదు.
"నువ్వు ముసలాడైపోతే నేను ఏం చేయాలి. నేనేం చేయలేను. నువ్వు ముసలోడైపోవద్దు. డమ్ డౌ (డంబెల్స్ = ఎక్సర్‌సైజ్) చేసుకో. బాగా బలంగా ఉండు" అని చెప్పటం మొదలెట్టావు. ఒక అరగంటపాటు ఇదే గోల.
మధ్యలో "ముసలోడై రోడ్డు మీద డబ్బులు తీసుకుంటావా" అని కూడా అడిగావు. మధ్యలో ఇదెక్కడ్నుంచి వచ్చిందిరా అనుకున్నాను. తర్వాత తెలిసింది, అమ్మ నిన్ను బండి ఎక్కించుకుని తీసికెళ్తూ దార్లో ఎవరో ముసలి బిచ్చగాడు కనిపిస్తే డబ్బులేసిందని. నేనూ అలాగ రోడ్ల మీదకెళ్లిపోతానని నీకు జాలీ, తర్వాత నువ్వేవైపోతావో అని భయం. "అయ్య పిచ్చముండా" అనుకున్నాను. అమ్మ వచ్చాకా చెప్తే ఆశ్చర్యపోయింది.
ఎంతైనా నువ్వీ మధ్య సెంటీగాడిలా తయారవుతున్నావురా. మొన్న మగధీర సినిమాలో హీరో వందమందిని చంపే ఫైట్ సీన్ చూస్తున్నాం మనిద్దరం యూట్యూబులో. ఆ ఫైట్ చివర్లో విలన్ హీరోయిన్ మీద కత్తి విసిరి చంపేస్తాడు. ఆమె లోయలోకి జారిపోతుంది. ఆమె చేయి ఆఖరుసారైనా పట్టుకోవాలని హీరో కూడా దూకేస్తాడు. వాళ్ళిద్దరూ లోయలోకి అలా జారుతుంటారు. నీ వంక చూస్తే మళ్ళీ కళ్ళమ్మటా నీళ్ళు. వొణికే గొంతుతోటి "ఏమైంది, చచ్చిపోతారా" అని నన్ను అడగటం. ఇంకా ఆరు నిండలేదు గుంటవి, అప్పుడే ఇంత సెంటిమెంటేంట్రా అనుకున్నాను.
Sunday, 10 March 2019
మన పార్క్ ప్రయాణం..
ఈ పార్క్ సోమవారం తెరవరు అని తెలియక నాన్న మనల్ని ఎత్తుకొచ్చాడు..తీరా వచ్చాకా చూస్తే మూసేసారు.. అయ్యో అనుకుంటూ వెనక్కు పోయాం.. మళ్ళీ ఏదీ ఈ ఆదివారం పూట వచ్చాం.. ఈ పార్క్ నిండా ఎన్ని రకాల జీవులో.. మనకు తెలియనివి... తెలిసినవి.
ముఖ్యంగా పాములు చూస్తేనే నాకు భయం వేసింది.. నీకు కోతిపిల్లలు చాలా నచ్చాయి.. వాటితో ఆడుకున్నావు. ఇద్దరం గడ్డిమీద పడుకుంటే చెట్ల నీడల్లో కొమ్మలమధ్య నువ్వ పిట్టల్ని చూపించి నీకు చాలా కబుర్లు చెప్పాను. నాన్న మనకు తినడానికి ఏదైనా తెస్తానని వెళ్ళాడు. ఐస్ క్రీం పట్టుకువచ్చాడు. అంత దూరం నడవలేక సైకిల్ అద్దెకు తెచ్చాడు. భలే ఉందిలే సైకిల్.. నాకు చిన్నతనం గుర్తుకువచ్చింది. ఒక్కసారి ఎక్కి తొక్కాలనిపించింది. తొక్కేసాను. అక్కడే ఓ ఎలుగుబంటి ఎంత సందడి చేసిందో.. ఇంకా తెల్లపులిని చూడటం
చాలా బావుంది అంత దగ్గర నుంచి పులిని చూడటం ఇదే మొదటిసారి. నాకు భయం వేసింది మీనాన్న భుజాలమీద కూచుని సంబరంగా నువ్వు పులిని చూస్తున్నావు. చక్కని ఫోటోలు దిగాం ఇక్కడ.. చూడు బావున్నాయి కదా..
Sunday, 24 February 2019
ప్రకృతంటే మాతోపాటూ నువ్వూ ఆనందిస్తావు..
నిజంగా ఈ ఇరుకు గదులు.. ఆటస్ఠలం లేని వీధులు మాకే చిరాగ్గా ఉంటే మరి నీకెలా ఉండి ఉంటుందో కదా అప్పుడప్పుడూ జాలేస్తుంది. చాలా వరకూ నిన్ను మా బాల్యంలో మాకు ఉన్నస్వేచ్ఛనే నీకు ఇచ్చి పెంచాలని అనుకున్నా కుదిరే వాతావరణం ఇక్కడలేదు.. ఏం చేస్తాం.. ఈ ఇరుకు బ్రతుకు ఇంతేనని మీ నాన్న అనుకోలేదు.. వీలున్నప్పుడల్లా నిన్ను ఎక్కడికన్నా తీసుకుపోవాలని చూస్తూనే ఉంటాడు.. ఇదిగో ఈ ఆదివారం ఇలా పక్కనే ఉన్నకేబిఆర్ పార్క్ లోకి వచ్చాం.. ఇది చాలా పెద్దదే.. చుట్టూ పెద్ద అడవిలా ఉంది.. ఏవో కూతలు.. ముఖ్యంగా నెమళ్ళు అరుస్తున్నాయి.. మనం చూస్తుండగానే రెండు నెమళ్ళు మన ముందు నుంచి వెళ్ళాయి.. ఎంత అందంగా ఉన్నాయో..బొమ్మ పారేసుకుని తెచ్చేవరకూ తెగమారాం చేసావు.. నీతో చిన్న కారన్నా లేనిదే బయటకు రావుకదా.. ఈ గడ్డిలో పిచ్చిగా దొల్లడం ముగ్గురికీ ముచ్చటగానే ఉంది.. పైగా ఫోటోలకు ఫోజులిస్తున్నావ్.. మీ నాన్నలా అయిపోవాలని కాబోలు.. బంగారు కొండ..
Saturday, 9 February 2019
ఊహించని ఊహ...
Phaneendra - the moviemaker & Sreemaan - the troublemaker/ Neanderthal.
Nowadays I am feeling like a big Pro in art. I am not lying- Out of 1-10 I am at level 6. *** I have been playing this video game called Sp...
-
It’s me Meher. I am in Class 6 and it’s a great class! The school I'm in is ‘Don Bosco’, and it’s quite fun, but this post is about the ...
-
This is about the book Diary of a Wimpy Kid. It’s mostly about this kid names Greg Heffly and his family. Greg and his family always get int...


.jpeg)
.jpeg)

.jpeg)


























