Saturday, 2 May 2020

ఎదిగిపోతున్నావ్ రోయ్.. మెహెర్ శివ రాఘవా..





తల్లిగా నాకు తండ్రీగా ఫణికి నువ్వు చిన్నాడిలా కనిపించాల్సింది పోయి. పెద్దవాడిలా కనిపించడం మొదలైంది. నీ మాటలు చేష్టలు అన్నీ ముదురు టెంకెకి ఉన్నట్టు ఉన్నాయి. ఎన్ని వగలు పోతాయో.. మీ నాన్న నీకు అన్నీ నూరిపోసి నిన్ను బాల మేధావుల జాబితానుంచి గడుసు పిల్లాడి జాబితాలోకి చేర్చి పారేశాడు.

ఇప్పుడు నీకు ఆరో ఏడు నడుస్తుంది. నీకు నేను నాన్నా అప్పుడప్పుడు నాయనమ్మా దోస్తులుగా మిగిలాం. అన్నట్టు మరిచాను.. మీ లల్లి పిన్ని కూడా నీ గురించి అడుగుతుందిరోయ్.. నువ్వంటే తనకి చాలా ఇష్టం. ముఖ్యంగా నీ ఇంగ్లీషు నువ్వు మాట్లాడే అమెరికన్ ఏసెంట్ అంటే తనకి మరీ ఇష్టం.  మన జాబితాలో బంధువులనుకున్నవాళ్ళు ఇప్పుడు మనకి అందుబాటులో లేరు. కాబట్టి వాళ్ళసంగతి వదిలేద్దాం.





ఈ మన చిన్న లోకంలో నేను నాన్నా నిన్ను బంగారు కొండలా చూసుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు UKG చదువుతున్నావ్... అది అయిపోయినట్టే.. అంటే ఇక నుంచీ ఒకటో తరగతి అన్నమాట. అబ్బాయిగారికి ఇప్పుడు చాలా సంగతులే తెలుసు. ప్రేమంటే తెలుసు, అందం అంటే తెలుసు, నాన్నదగ్గర ఏలా గారం చేయాలో తెలుసు, అమ్మని అందగత్తని పొగిడి పడేసి, మరీ పనిచేయించుకోవడం తెలుసు.. పూల మొక్కలన్నా.. పక్షులన్నా మరింత ఇష్టం.. తిండిలో చికెన్ బాగా ఇష్టపడతావు. వడియాలు, ఆమ్లేట్, ఫ్రెంచ్ ఫ్రై ఇలా నీ ఇష్టాలు కూడా మా ఇద్దరి కన్నా భిన్నం. అన్నట్టు నీకు పెరిగి పెద్దయ్యాకా పోలీస్ కావాలనే గోల్ కూడా ఉందిరోయ్. నీ చిన్నులు ఇన్నని ఏం చెప్పను. అన్నీ మంచిలక్షణాలే కనిపిస్తున్నాయ్ మరి.

పెరిగి పెద్దయ్యాకా నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ మాత్రమే కావాలనే పిచ్చి మాకేం లేదు. నువ్వు ఏదైనా మాకు ఆనందమే... నీకు సాహిత్యం పట్ల అభిలాష ఉండాలి అనే కోరుకుంటాను.. ఎందుకంటే మీ నాన్న ఓ కొత్త లోకాన్ని కనుక్కున్నాడు.. అందులోకి నన్నూ తీసుకుపోయాడు.. నేను అంత లోకాన్నీ అర్ధం చేసుకోలేకపోయినా.. కొంత రాతలా పట్టుకున్నాను. నువ్వూ ఆ లోకంలో విహరించాలని ఓ తల్లిగా కోరుకుంటాను. సాహిత్యం తెలిసినవాడికి దాన్ని మరిగిన వాడి ఆలోచనలు క్రూరంగా పోవని గట్టిగా నమ్ముతాను.

ఎదుటివారితో ప్రేమగా.. జాలికలిగి బ్రతికితే చాలు.. నీకు మంచి భవిష్యత్ ఇవ్వాలని, అంతకన్నా ముందు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటాను. నా బంగారం చల్లగా ఉండాలి.














No comments:

Post a Comment

Phaneendra - the moviemaker & Sreemaan - the troublemaker/ Neanderthal.

Nowadays I am feeling like a big Pro in art. I am not lying- Out of 1-10 I am at level 6.  *** I have been playing this video game called Sp...